Share News

నితిన్‌ నబీనే నా బాస్‌

ABN , Publish Date - Jan 21 , 2026 | 03:24 AM

బీజేపీ కార్యకర్తనైన తనకు పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ బాస్‌ అని ప్రధాని మోదీ అన్నారు. పార్టీ పరంగా ఆయన చేసే సూచనలను పాటిస్తానని తెలిపారు.

నితిన్‌ నబీనే నా బాస్‌

  • పార్టీ కార్యకర్తగా ఆయన ఆదేశాలను పాటిస్తా.. ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, జనవరి 20(ఆంధ్రజ్యోతి): బీజేపీ కార్యకర్తనైన తనకు పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ బాస్‌ అని ప్రధాని మోదీ అన్నారు. పార్టీ పరంగా ఆయన చేసే సూచనలను పాటిస్తానని తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన బిహార్‌కు చెందిన నితిన్‌ నబీన్‌(45) మంగళవారం ఆ బాధ్యతలు స్వీకరించారు. న్యూఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి డాక్టర్‌ కె. లక్ష్మణ్‌.. తొలుత నితిన్‌ నబీన్‌ ఎన్నికను ప్రకటించారు. అనంతరం ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, జేపీ నడ్డా, నితిన్‌ గడ్కరీ, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో నితిన్‌ నబీన్‌ అధ్యక్షుడి గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. పార్టీకి సంబంధించిన విషయాల్లో నితిన్‌ నబీన్‌ తనకు బాస్‌ అని స్పష్టం చేశారు. తనతోపాటు పార్టీలో ఉన్నవారందికీ నితినే అధ్యక్షుడని పేర్కొన్నారు. బీజేపీ నడిపించడమే కాక మిత్రపక్షాలను సమన్వయం చేసుకునే బాధ్యత కూడా నితినేదేనని అన్నారు. 1981-1996 మధ్య కాలంలో జన్మించిన నబీన్‌ ఈ సహస్రాబ్ది నేత అని, భారత దేశంలో జరిగిన మార్పులన్నీ ప్రత్యక్షంగా చూసిన తరానికి చెందిన వ్యక్తి అని పేర్కొన్నారు. బాల్యంలో రేడియోలో వార్తలు విన్న తరం నుంచి ఏఐని ఉపయోగించడంలో ఆరితేరిన తరం వరకూ నితిన్‌ ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. బీజేపీ అధ్యక్షులు మారినా ఆదర్శాలు మారవని స్పష్టం చేశారు. గౌరవనీయులైన నితిన్‌ నబీన్‌ అంటూ ప్రసంగించిన ప్రధాని మోదీ.. గత 11 ఏళ్ల లో తన హయాంలో బీజేపీ ప్రభుత్వం సాధించిన ప్రగతిని వివరించారు. తన పనిని అధ్యక్షుడి ముందు ఉంచానని, ఆయన ఆదేశాలు, సూచనలు కోసం ఎదురుచూస్తున్నానని వ్యాఖ్యానించారు. అక్రమ చొరబాట్లతో దేశ భద్రతకు ముప్పు అని ప్రధాని మోదీ ఈ సందర్భంగా అన్నారు. ప్రభుత్వాల పట్ల సానుకూలంగా ఉన్న వారిని, జర్నలిస్టులను అర్బన్‌ నక్సల్స్‌ బెదిరిస్తున్నారని తెలిపారు.

ఇక, పార్టీ నూతన అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రధాన సేవకుడుగా పనిచేస్తూ కార్యకర్తలకు ప్రేరణగా నిలిచారని కొనియాడారు. ఓ సామాన్య కార్యకర్తను పార్టీలో అగ్రస్థానానికి ఎంపిక చేసినందుకు కృత జ్ఞతలు తెలిపారు. రాజకీయాలు స్వల్పకాలిక ప్రయోగం కాదని, దీర్ఘకాలిక బాధ్యత అని భావించాలని కార్యకర్తలకు సూచించారు. తమిళనాడు, అస్సాం, పశ్చిమ బెంగాల్‌, కేరళ, పుదుచ్చేరిలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు శ్రమించాలని, వికసిత్‌ భారత్‌ లక్ష్య సాధనకు కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.


లక్ష్మణ్‌.. ఓట్లు ఏమైనా చోరీ అయ్యాయా?

బీజేపీ నూతన అధ్యక్షుడిగా నితిన్‌ నబీన్‌ బాధ్యతల స్వీకరణ సందర్భంగా ప్రధాని మోదీ, బీజేపీ సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, ఎంపీ కె.లక్ష్మణ్‌ మధ్య ఆసక్తికరణ సంభాషణ చోటు చేసుకుంది. ‘ఓట్లు ఏమైనా చోరీ అయ్యాయా(కోయీ ఓట్‌ చోరీ హువా క్యా)?’ అంటూ లక్ష్మణ్‌ను నవ్వుతూ ప్రశ్నించారు. ఇందుకు స్పందించిన లక్ష్మణ్‌.. ‘సర్‌ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌)’తో ఓటరు జాబితాను సరిచేశామం టూ అంతే సరదాగా మోదీకి బదులిచ్చారు. అంతేకాక, ‘క్యా చునావ్‌ అధికారీ..? చునావ్‌ కైసే హువా..?(రిటర్నింగ్‌ అధికారీ ఎన్నిక ఎలా జరిగింది)’ అని లక్ష్మణ్‌ను మోదీ ప్రశ్నించారు. ఇందుకు ‘అచ్ఛా హువా.. సఫలతా భీ హువా.. (బాగా జరిగింది. విజయవంతమైంది)’ అని లక్ష్మణ్‌ వివరించారు. ఇక, నితిన్‌ నబీన్‌కు మద్దతుగా ఉత్తరప్రదేశ్‌ నుంచి నామినేషన్‌ సెట్‌ దాఖలుకు వచ్చిన ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కూడా లక్ష్మణ్‌తో సరదాగా మాట్లాడారు. లోక్‌సభ, శాసనసభ ఎన్నికలను తలపించేలా అధ్యక్ష ఎన్నిక జరుగుతోందే? అని లక్ష్మణ్‌తో యోగి అన్నారు. అలాగే, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ మాట్లాడుతూ ‘ఇత్‌నా గంభీర్‌ హై..!( ఇంత గంభీరంగా ఉన్నారేంటి)’ అని వ్యాఖ్యానించగా.. ఎలక్షన్‌ కోడ్‌ హై.. !(ఎన్నికల కోడ్‌ అమలులో ఉంది)అని లక్ష్మణ్‌ అన్నారు. కాగా, ప్రపంచంలోనే అతిపెద్ద సభ్యత్వం ఉన్న పార్టీకి జాతీయ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా బాధ్యతలు నిర్వహించడం తెలుగువాడిగా తనకు గర్వంగా ఉందని లక్ష్మణ్‌ ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు.

Updated Date - Jan 21 , 2026 | 04:48 AM