పునర్విభజనతో నష్టం వాటిల్లితే.. పాత డీఎంకేని చూస్తారు జాగ్రత్త!
ABN , Publish Date - Apr 15 , 2026 | 03:50 AM
నియోజకవర్గాల పునర్విభజనలో తమిళనాడుకు నష్టం కలిగితే దేశం ఇప్పటివరకూ చూడని పాత డీఎంకేని చూడాల్సి వస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం ఎంకే స్టాలిన్ హెచ్చరించారు.
ఉత్తరాది ఆధిపత్యం పెరిగితే భారీ ఆందోళనలు
కేంద్రానికి స్టాలిన్ హెచ్చరికలు
చెన్నై, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గాల పునర్విభజనలో తమిళనాడుకు నష్టం కలిగితే దేశం ఇప్పటివరకూ చూడని పాత డీఎంకేని చూడాల్సి వస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం ఎంకే స్టాలిన్ హెచ్చరించారు. జనాభా నియంత్రణను అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలను శిక్షించడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. పునర్విభజనపై పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని జరిపేందుకు సమాయత్తమవుతున్న తరుణంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఆయన తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. దీనికి సంబంధించి ఆయన ఓ వీడియో సందేశాన్ని వెలువరించారు. ‘‘పునర్విభజన చట్టాన్ని ఈ నెల 16న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోతున్నారు. పశ్చిమబెంగాల్, తమిళనాడుల్లో ఎన్నికలకు ముందు ఈ సమావేశాలు ఏర్పాటు చేశారు. డీలిమిటేషన్‌పై రాజ్యాంగ సవరణను బలవంతంగా ఆమోదింపజేయాలని కేంద్రం భావిస్తోంది. తమిళనాడు సహా దక్షిణాది రాష్ట్రాలపై తన నిర్ణయాన్ని బలవంతంగా రుద్దాలని చూస్తోంది. ఈ ప్రయత్నం ప్రజాస్వామ్యంపై బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దాడి. అంతకుమించి ఇది రాష్ట్రాల హక్కులపై ప్రత్యక్ష దాడి. దీనిపై మేము ముందునుంచీ హెచ్చరిస్తూనే ఉన్నాం. పునర్విభజన కారణంగా నష్టపోనున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆయా రాష్ట్రాల్లోని ప్రధాన రాజకీయ పార్టీల నేతలతో ఉమ్మడి కార్యాచరణ కమిటీ సమావేశం కూడా జరిపించాం. పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదని హామీ ఇవ్వాలని డిమాండ్ చేశాం. ఇంతవరకూ దీనిపై స్పందించలేదు. ఈ విషయమై చర్చించడానికి ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ కోరినా స్పందించలేదు’ అని స్టాలిన్ ధ్వజమెత్తారు. పునర్విభజన ఎలా జరుపనున్నారో ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం లేదని, కొత్త చట్టంలో ఉండబోయే అంశాలు ఏమిటో అంతుబట్టడం లేదన్నారు. ఉత్తరాది రాష్ట్రాలు మేలు చేకూర్చేలా, దక్షిణాది రాష్ట్రాలకు నష్టం కలిగించేలా పునర్విభజన చట్టం ఉంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని, రాష్ట్రాన్ని స్తంభింపజేయడానికి కూడా సిద్ధమేనని స్టాలిన్ హెచ్చరించారు. ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోని ప్రతి కుటుంబమూ రోడెక్కి ఆందోళనకు దిగుతుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న తన నాయకత్వంలోనే రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళన జరుగుతుందని పేర్కొన్నారు. ఈ పోరాటంలో తమిళనాడు విజయం సాధిస్తుందన్నారు. ఇది ఎన్నికల సమయం, తమిళ నాయకుల దృష్టి ఎన్నికలపైనే ఉంటుంది కనుక గుట్టుచప్పుడు కాకుండా చట్టాన్ని చేసేద్దామని బీజేపీ పాలకులు అనుకుంటే తీవ్ర పరిణామాలే ఎదురవుతాయని హెచ్చరించారు. ఈ హెచ్చరికలను తాను ముఖ్యమంత్రిగా చేయడం లేదని, ఒక డీఎంకే నేతగా చేస్తున్నానని స్పష్టం చేశారు. కేంద్రంలోని ప్రస్తుత పాలకులు ఇప్పటివరకూ చూడని తమిళనాడును చూడాల్సి వస్తుందని, 1950, 1960 దశకాల నాటి డీఎంకే పాతముఖాన్ని మళ్లీ చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. తాను బెదిరించడం లేదని, తీవ్రంగా హెచ్చరిస్తున్నానని, ఒకవేళ బీజేపీ పాలకులు బెదిరింపుగా భావించినా ఫరవాలేదని స్టాలిన్ అన్నారు.