Share News

మా గళాన్ని పట్టించుకోకపోతే భారీ మూల్యం తప్పదు

ABN , Publish Date - Apr 16 , 2026 | 03:07 AM

డీలిమిటేషన్‌ బిల్లును పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టడం అంటే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేయడమేనని డీఎంకే ...

మా గళాన్ని పట్టించుకోకపోతే భారీ మూల్యం తప్పదు

  • ‘డీలిమిటేషన్‌’తో దక్షిణాదికి తీవ్ర అన్యాయం: స్టాలిన్‌

చెన్నై, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): డీలిమిటేషన్‌ బిల్లును పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టడం అంటే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేయడమేనని డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు గళాన్ని పట్టించుకోకపోతే కేంద్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బుధవారం ఉదయం ఆయన ధర్మపురి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పార్టీ ఎంపీలు, జిల్లా కార్యదర్శులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ‘దేశ ప్రగతికి దోహదపడిన నేరానికి దక్షిణాది రాష్ట్రాలను శిక్షిస్తారా? ఇదేనా కేంద్రం మనకిచ్చే ప్రతిఫలం’ అంటూ నిప్పులు చెరిగారు. ఈ వైఖరికి నిరసనగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా నల్లజెండాలతో నిరసన తెలపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇన్నాళ్లూ మన తలలపై వేలాడుతున్న కత్తి ఇప్పుడు మనపైనే పడిందని వ్యాఖ్యానించారు. ఈ తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి వివిధ రాష్ట్రాల ఎంపీలతో సంప్రదిస్తూ, డీఎంకే ఒక సమన్వయ వ్యూహాన్ని రూపొందిస్తోందని తెలిపారు. డీలిమిటేషన్‌ సవరణ బిల్లుపై ప్రతి దక్షిణ భారతీయుడు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నాడని తెలిపారు. ‘బీజేపీ నిప్పుతో చెలగాటమాడుతోంది’ అన్నారు. ‘ఇది కేవలం డీఎంకే అధ్యక్ష హోదాలో మాత్రమే కాకుండా, ఆత్మగౌరవం గల తమిళుడిగా హెచ్చరిస్తున్నా. మన ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి దేశంలోని అన్ని పార్టీలు, ఎంపీలు ఏకం కావాలి’ అని ఆయన పిలుపునిచ్చారు.

Updated Date - Apr 16 , 2026 | 03:07 AM