86 ఏళ్లున్న నా తండ్రిని 1 కిలోమీటరు దూరం నడిపిస్తారా? టీవీ వ్యాఖ్యాత ఫైర్
ABN , Publish Date - Feb 10 , 2026 | 09:09 PM
ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ సేవాలోపం కారణంగా వృద్ధుడైన తన తండ్రి ఏకంగా కిలోమీటరు దూరం నడవాల్సి వచ్చిందని ప్రముఖ టీవీ యాంకర్, నటి మినీ మాథుర్ ఇన్‌స్టాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ టీవీ యాంకర్, నటి మినీ మాథుర్ ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై (IndiGo Airlines) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంబై ఎయిర్‌పోర్టులో వృద్ధుల విషయంలో సంస్థ తీరు అసలేమాత్రం బాలేదని ఇన్‌స్టా వేదికగా ఫైరైపోయారు (Mini Mathur).
తన ఇన్‌స్టా స్టోరీలో ఆమె ఇండిగోపై అసంతృప్తిని వెళ్లగక్కారు. 86 ఏళ్ల వయసున్న తన తండ్రి ఇండిగో సేవాలోపం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారని అన్నారు. ‘డియర్ ఇండిగో.. సాధారణంగా నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రచ్చ చేయను. కానీ మీరు సీనియర్ సిటిజన్ల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ముంబై ఎయిర్‌పోర్టులో సీనియర్ సిటిజన్లు చెక్ ఇన్ అయ్యేందుకు ప్రత్యేక కౌంటర్ లేదు. కౌంటర్‌లోని సిబ్బంది చాలా దురుసుగా వ్యవహరించారు. ముందస్తుగా బుక్ చేసుకునే వీల్‌చైర్‌లు ఏవీ అందుబాటులో లేవు. 86 ఏళ్ల వయసున్న మా నాన్న కేబిన్ లగేజీని తీసుకుని కిలోమీటరు దూరంలో ఉన్న గేటు వరకూ నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. కనీసం బగ్గీని కూడా ఏర్పాటు చేయలేదు. వయసు మళ్లిన వారి విషయంలో సరిగా వ్యవహరించలేని సంస్థ భవితవ్యం కూడా క్లిష్టంగానే ఉంటుంది’ అని రాసుకొచ్చారు. అయితే, ఈ ఉదంతంపై ఇండిగో సంస్థ ఇంకా స్పందించాల్సి ఉంది.
ఇక ఈ పోస్టుపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. వృద్ధ ప్రయాణికులకు అనువుగా మౌలిక వసతులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అనేక మంది అభిప్రాయపడ్డారు. ఎయిర్‌లైన్స్ సంస్థల సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలని కూడా అన్నారు. వృద్ధులకు తగిన సౌకర్యాలు కల్పించే దిశగా ఉద్యోగుల్లో బాధ్యత పెంచాలని అభిప్రాయపడ్డారు.
