తెల్లనివన్నీ పాలు కావు!
ABN , Publish Date - Feb 21 , 2026 | 02:19 AM
ఉదయం అల్పాహారం తీసుకోవడం కాస్త ఆలస్యమైనా భరిస్తాం కానీ కాఫీ, టీ చేతికి అందకపోతే కేకలేస్తాం! బడికి వెళ్లే పిల్లలైతే ఉదయం...
ప్రతి 3శాంపిళ్లలో ఒకదాంట్లో కల్తీ..పాలల్లో యూరియా, కాస్టిక్ సోడా
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: ఉదయం అల్పాహారం తీసుకోవడం కాస్త ఆలస్యమైనా భరిస్తాం కానీ కాఫీ, టీ చేతికి అందకపోతే కేకలేస్తాం! బడికి వెళ్లే పిల్లలైతే ఉదయం, సాయంత్రం గ్లాసుడు పాలు తాగుతారు. మరి.. పెద్దవాళ్లు, పిల్లలు తాగుతోంది నాణ్యమైన పాలేనా? ఎందుకీ అనుమానం అంటే.. ఇటీవల కొన్నేళ్ల నుంచి పాల నాణ్యతను పరీక్షిస్తే దేశవ్యాప్తంగా ప్రతి మూడు శాంపిళ్లలో ఒకదాంట్లో కల్తీ జరుగుతున్నట్లు నిర్ధారణ జరుగుతోంది. గుజరాత్‌లో ఇటీవల అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఓ డెయిరీ సంస్థపై అధికారులు దాడి చేస్తే దిగ్ర్భాంతికరమైన విషయం బయటపడింది. అక్కడ ప్రతి 300లీటర్ల స్వచ్ఛమైన పాలల్లో డిటర్టెంట్, యూరియా, కాస్టిక్ సోడా కలిపిన 1800 లీటర్ల ద్రావణాన్ని మిక్స్‌చేసి ‘ప్యాకెట్ పాలు’గా విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గత ఏడాది మధ్యప్రదేశ్‌లో ఓ డెయిరీ కంపెనీకి చెందిన తొమ్మిది కేంద్రాలపై ఈడీ అధికారులు దాడి చేశారు. ఏమాత్రం నాణ్యత ప్రమాణాలు లేని పాల ఉత్పత్తులను బెహ్రయిన్, సింగపూర్, ఒమన్, యూఏఈకి ఎగుమతి చేసేందుకు 63 ఫోర్జరీ పత్రాలను ఆ కంపెనీ నిర్వాహకులు సృష్టించినట్లు అధికారులు గుర్తించారు. 2025లో దేశవ్యాప్తంగా పాల ఉత్పత్తులకు సంబంధించి ప్రతి వంద శాంపిళ్లలో 38 శాంపిళ్లు పరీక్షలో విఫలమయ్యాయి. కాగా, గత పదేళ్లలో మనదేశంలో పాల ఉత్పత్తి 63.56ు పెరగడం విశేషం. 2015లో 146 మిలియన్ టన్నుల పాల ఉత్పత్తి జరిగితే 2025లో అది 239 మిలియన్ టన్నులుగా నమోదైంది. 2025లో తలసరి పాల లభ్యత 471 గ్రాములుగా నమోదైంది. ఇది ప్రపంచ సగటు(322 గ్రాములు) కన్నా ఎక్కువ.