Share News

చమురు కేంద్రాలే టార్గెట్‌!

ABN , Publish Date - Mar 17 , 2026 | 03:49 AM

పశ్చిమాసియాలో యుద్ధం ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించటం లేదు. ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయంగా పేరొందిన దుబాయి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో....

చమురు కేంద్రాలే టార్గెట్‌!

దుబాయి, టెల్‌అవీవ్‌, మార్చి 16: పశ్చిమాసియాలో యుద్ధం ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించటం లేదు. ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయంగా పేరొందిన దుబాయి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో ఉన్న ఓ ఇంధన ట్యాంకర్‌పై సోమవారం ఉదయం డ్రోన్‌ దాడి జరగటంతో భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. ఎయిర్‌పోర్టు అధికారులు కొన్ని గంటలపాటు విమాన సర్వీసులను నిలిపివేసిన అనంతరం పునరుద్ధరించారు. మరోవైపు, యూఏఈపై ఇరాన్‌ జరిపిన క్షిపణి దాడిలో ఓ వాహనం ధ్వంసమైంది. ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. యూఏఈ ఎమిరేట్స్‌లో ఒకటైన ఫుజైరాలోని చమురుకేంద్రంపై జరిగిన డ్రోన్‌ దాడిలో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. సౌదీ అరేబియాపైనా ఇరాన్‌ విరుచుకుపడింది. ఆ దేశంలో ప్రధాన చమురు కేంద్రాలకు నెలవైన తూర్పు ప్రాంతం లక్ష్యంగా పెద్ద సంఖ్యలో డ్రోన్లను ప్రయోగించింది. వెల్లువలాగా డ్రోన్లు వచ్చాయని, 35 డ్రోన్లను తాము అడ్డుకున్నామని సౌదీ అరేబియా ప్రకటించింది. తమ భూభాగం మీదికి కూడా ఇరాన్‌ డ్రోన్లను పంపించిందని ఇజ్రాయెల్‌ వెల్లడించింది. తాము సైతం ఇరాన్‌ మీద దాడులు కొనసాగించామని తెలిపింది. రాజధాని టెహ్రాన్‌లో పలు చోట్ల పేలుళ్లు జరిగినట్లు సమాచారం. పూర్తి వివరాలు వెల్లడి కాలేదు. ఇరాన్‌ వాయుసేనలో 85 శాతాన్ని ధ్వంసం చేశామని ఇజ్రాయెల్‌ మిలిటరీ ప్రతినిధి వెల్లడించారు. ఇరాన్‌లోని చబ్బహార్‌ స్వేచ్ఛా వాణిజ్య జోన్‌ సమీపంలోని కొండల వద్ద ఉన్న సైనిక కేంద్రాలపై అమెరికా యుద్ధవిమానాలు దాడులు జరిపినట్లుగా అల్‌జజీరా వార్తాసంస్థ వెల్లడించింది. చబ్బహార్‌ పోర్టు ఇరాన్‌కు వ్యూహాత్మకంగా కీలకమైనది. హొర్ముజ్‌ జలసంధి మీదుగా వెళ్లకుండానే హిందూ మహాసముద్రంలోకి వెళ్లటానికి అవకాశం కల్పిస్తుంది. ఈ పోర్టు మీద ఉన్న షాహిద్‌ బెహెస్తి టర్మినల్‌ నిర్వహణకు సంబంధించి ఇరాన్‌-భారత్‌ మధ్య 2024 మే నెలలో పదేళ్ల ఒప్పందం కుదిరింది. లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ సోమవారం కూడా దాడులు కొనసాగించింది. ఆ దేశ రాజధాని బీరూట్‌లో పలు భవనాలపై బాంబులు కురిపించింది. ఇవన్నీ ఇరాన్‌కు సంబంధించిన హిజ్బుల్లా మిలిటెంట్‌ గ్రూపునకు సంబంధించినవని ఇజ్రాయెల్‌ పేర్కొంది. బీరూట్‌తోపాటు దక్షిణ లెబనాన్‌లోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు ఖాళీ చేసి వెళ్లాలని హెచ్చరించింది. దాడుల్లో సోమవారం ఏడుగురు మరణించారు. గత రెండు వారాల వ్యవధిలో దాదాపు 8 లక్షల మంది లెబనాన్‌ ప్రజలు తమ ఇళ్లను వదిలిపెట్టి వెళ్లిపోయారు.

Updated Date - Mar 17 , 2026 | 03:49 AM