నీది మొండి వైఖరి.. కాదు, నా హక్కు!
ABN , Publish Date - Nov 15 , 2026 | 02:49 AM
కర్ణాటక-తమిళనాడు రాష్ట్రాల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న మెకెదాటు డ్యామ్ వివాదం కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మరోసారి మాటల మంటలు రేపింది.
‘మెకెదాటు’పై కర్ణాటక, తమిళనాడు కాంగ్రెస్ నేతల మధ్య మాటల మంట
బెంగళూరు/చెన్నై, నవంబరు 14: కర్ణాటక-తమిళనాడు రాష్ట్రాల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న మెకెదాటు డ్యామ్ వివాదం కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మరోసారి మాటల మంటలు రేపింది. కావేరీ నదిపై ఈ రిజర్వాయర్‌ను నిర్మించి తీరుతామంటూ శుక్రవారం కర్ణాటక సీఎం శివకుమార్ చేసిన వ్యాఖ్యలను తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ మాణిక్కం ఠాగూర్ తీవ్రంగా ఖండించారు. డీకే మొండి వైఖరితో ముందుకు వెళ్తున్నారని, తమిళనాడుకు ప్రాణ సంకటంగా మారిన ఈ డ్యామ్ నిర్మాణం ఎట్టిపరిస్థితిలోనూ ఆమోద యోగ్యం కాదని అన్నారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు తీర్పును, కావేరీ జల వివాదాల ట్రైబ్యునల్ తుదితీర్పును ధిక్కరించేలా సీఎం వ్యాఖ్యానించారని విమర్శలు గుప్పించారు. మాణిక్కం ఠాగూర్ చేసిన వ్యాఖ్యలపై డీకే శివకుమార్ గట్టిగా బదులిచ్చారు. ‘‘నా రాష్ట్రం- నాహక్కు’’ అని వ్యాఖ్యానించారు. తమిళనాడుకు ఎలాంటి అన్యాయం జరగకుండానే ఈ ప్రాజెక్టు విషయంలో ముందుకు సాగుతామని చెప్పారు.