Share News

మెహందీ పెట్టే మెషీన్‌.. మరికొన్ని ఉద్యోగాలు ఊడినట్లే!

ABN , Publish Date - Sep 12 , 2026 | 05:41 AM

పెళ్లిళ్లు, పండగలు, శుభకార్యాల్లో మెహందీ కళాకారులకు ప్రత్యేకస్థానం ఉంటుంది. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయ కళనే నమ్ముకుని, ఎంతో ఓపికగా క్లిష్టమైన డిజైన్లను తీర్చిదిద్దే మెహందీ ఆర్టిస్టుల నైపుణ్యానికి..

మెహందీ పెట్టే మెషీన్‌.. మరికొన్ని ఉద్యోగాలు ఊడినట్లే!

  • యంత్రం కింద చేయిపెడితే చాలు.. డిజైన్‌ సిద్ధం

  • పారిశ్రామికవేత్త హర్ష్‌గోయెంకా పోస్ట్‌

ముంబై, సెప్టెంబరు 11: పెళ్లిళ్లు, పండగలు, శుభకార్యాల్లో మెహందీ కళాకారులకు ప్రత్యేకస్థానం ఉంటుంది. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయ కళనే నమ్ముకుని, ఎంతో ఓపికగా క్లిష్టమైన డిజైన్లను తీర్చిదిద్దే మెహందీ ఆర్టిస్టుల నైపుణ్యానికి ఇప్పుడు ఆటోమేషన్‌ సరికొత్త సవాల్‌ విసురుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్‌ గోయెంకా ఎక్స్‌ వేదికగా పంచుకున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వైరల్‌ అవుతున్న ఆ వీడియోలో ఓ మహిళ యంత్రం కింద చేయి పెట్టగానే, ఎవరి సాయం లేకుండానే ఆ మెషీన్‌ అత్యంత కచ్చితత్వంతో మెహందీ డిజైన్‌ వేయడం అందులో కనిపిస్తుంది. ‘‘మరికొన్ని ఉద్యోగాలు ఊడినట్లే’’ అంటూ గోయెంకా పెట్టిన ఒక్క లైన్‌ క్యాప్షన్‌.. ఆటోమేషన్‌, ఉద్యోగాల భవిష్యత్తుపై పెద్దఎత్తున స్పందనలకు దారితీసింది. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. శుభకార్యాల వంటి సమయంలో యంత్రాలలోని సూదుల వంటి అమరికల కింద చేతులు పెట్టడానికి మహిళలు భయపడతారని, కావాలంటే వీటిని ముగ్గులు వేయడానికి వాడుకోవచ్చని కొందరు చమత్కరించారు. మెషీన్లు డిజైన్లు కాపీ చేయగలవేమో కానీ, చేతితో వేసే మెహందీకి ఉండే అందం, అందులోని చిన్న చిన్న ప్రత్యేకతలను భర్తీ చేయలేవని అభిప్రాయపడ్డారు. పెళ్లిళ్లలో మెహందీ వేయించుకోవడం అనేది ఓ అనుభూతి అని, ఎదురుగా మనిషి కూర్చొని ముచ్చట్లు చెప్తూ డిజైన్లు వేయడంలో ఉండే తృప్తి మెషీన్లలో లభించదని పేర్కొన్నారు. మరోవైపు, ఇటువంటి యంత్రాల వల్ల సంప్రదాయ ఉద్యోగాలు పోయినా కొత్తరకం ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మరికొందరు విశ్లేషిస్తున్నారు.

Updated Date - Sep 12 , 2026 | 05:43 AM