డీఎంకే కూటమికి ఎండీఎంకే గుడ్‌బై
ABN , Publish Date - Jun 28 , 2026 | 04:20 AM
తొమ్మిదేళ్లుగా డీఎంకే నేతృత్వంలోని ‘సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్(ఎ్‌సపీఏ)’ కూటమిలో కొనసాగిన ‘మరుమలార్చి ద్రావిడ మున్నేట్ర కళగం...
చెన్నై, జూన్ 27(ఆంధ్రజ్యోతి): తొమ్మిదేళ్లుగా డీఎంకే నేతృత్వంలోని ‘సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్(ఎ్‌సపీఏ)’ కూటమిలో కొనసాగిన ‘మరుమలార్చి ద్రావిడ మున్నేట్ర కళగం(ఎండీఎంకే)’ పార్టీ ఆ కూటమి నుంచి వైదొలిగింది. శనివారం చెన్నైలో నిర్వహించిన పార్టీ సర్వసభ్యమండలి సమావేశం అనంతరం ఎండీఎంకే అధినేత వైగో ఈ విషయాన్ని ప్రకటించారు. తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం 47 మంది ఎమ్మెల్యేలున్న అన్నాడీఎంకే నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ప్రయత్నించిందని వైగో ఆరోపించారు. మతతత్వ శక్తులతో పొత్తు పెట్టుకున్న అన్నాడీఎంకే ప్రభుత్వానికి డీఎంకే ఎలా మద్దతిస్తుందని ప్రశ్నించారు. అందుకే తాము డీఎంకే కూటమి నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. కాగా, ఇటీవల డీఎంకే చిహ్నంపై పోటీ చేసి గెలిచిన ఇద్దరు ఎండీఎంకే ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి గైర్హాజరవ్వడం గమనార్హం.