Share News

బద్రీనాథా... ఈ ట్రాఫిక్‌ జామ్‌ ఏమిటయ్యా?

ABN , Publish Date - May 31 , 2026 | 05:04 AM

చార్‌ధామ్‌ యాత్రలో భాగంగా బద్రీనాథ్‌ వెళుతున్న భక్తులు భారీ ట్రాఫిక్‌జామ్‌ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చార్‌ధామ్‌కు తోడు హేమకుండ్‌ సాహిబ్‌ యాత్ర కూడా ప్రారంభం కావడంతో....

బద్రీనాథా... ఈ ట్రాఫిక్‌ జామ్‌ ఏమిటయ్యా?

  • ఉత్తరాఖండ్‌ చమోలీ జిల్లాలో కదలని వాహనాలు

  • కొన్నిచోట్ల 20 నుంచి 30 గంటల దాకా జామ్‌

చమోలీ, మే 30: చార్‌ధామ్‌ యాత్రలో భాగంగా బద్రీనాథ్‌ వెళుతున్న భక్తులు భారీ ట్రాఫిక్‌జామ్‌ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చార్‌ధామ్‌కు తోడు హేమకుండ్‌ సాహిబ్‌ యాత్ర కూడా ప్రారంభం కావడంతో ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లా జోషిమఠ్‌ సమీపంలోని కొండ ప్రాంతాల్లోని ఇరుకైన, గతుకుల రోడ్లలో గత మూడు రోజులుగా వాహనాలు చిక్కుకుపోతున్నాయి. పెద్ద సంఖ్యలో బారులుతీరిన వాహనాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. బద్రీనాథ్‌ హైవే జోషిమఠ్‌ సమీపంలోని ‘జీరో బ్యాండ్‌’ నుంచి 8కిలోమీటర్ల మేర శనివారం రోజంతా ఈ ట్రాఫిక్‌జామ్‌ నెలకొంది. జోషిమఠ్‌, విష్ణు ప్రయాగ్‌ వంటి చోట్ల 20-30 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. వాహనాలు ముందుకు కదలకపోవడం, విశ్రాంతి స్థలాలు లేకపోవడం, గంటలతరబడి రోడ్ల మీదే ఉండాల్సి వస్తుండటంతో సరైన తిండి, నీరు లేక వేల సంఖ్యలో యాత్రికులు అవస్థలు పడుతున్నారు. పర్వతప్రాంతాల్లోని ఇరుకైన రోడ్లలో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. ట్రాఫిక్‌ సమస్య పరిష్కరించడానికి అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. జోషిమఠ్‌ ప్రాంతంలో గేట్‌ సిస్టమ్‌- వన్‌ వే ట్రాఫిక్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. దీని ప్రకారం ఒకేవైపు నుంచి ఒకే దిశలో వాహనాలను కొద్దిసేపు అనుమతించి.. ఆ తర్వాత మరోవైపు వాహనాలను అనుమతిస్తారు. ఈ మేరకు 30 నిమిషాల చొప్పున మార్చి మార్చి అనుమతిస్తుండటంతో ట్రాఫిక్‌ సమస్య నియంత్రించగలుగుతున్నామని అధికారులు తెలిపారు. భక్తుల తాకిడి భారీగా పెరిగినందున యాత్రికులు తమ ప్రయాణాలకు సంబధించి ప్రణాళికలను జాగ్రత్తగా రూపొందించుకోవాలని కోరుతున్నారు. బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌, గంగోత్రి, యమునోత్రిలను కలుపుకొని ప్రతి ఏడాది సాగే చార్‌ధామ్‌ యాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.

Updated Date - May 31 , 2026 | 05:04 AM