20 నిమిషాల్లో లాభం..840 కోట్లు?
ABN , Publish Date - Mar 25 , 2026 | 03:28 AM
స్టాక్ మార్కెట్‌లో చాలామంది పెట్టుబడులు పెడుతుంటారు. లాభానష్టాలను చవిచూస్తుంటారు. అయితే, ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో అమెరికాలో గుర్తు తెలియని ఓ పెట్టుబడిదారు/సంస్థ స్టాక్ మార్కెట్‌లో భారీ ...
అమెరికాలో గుర్తు తెలియని పెట్టుబడిదారుకు ట్రేడింగ్‌లో భారీ లబ్ధి
చమురు, ఎస్‌అండ్‌పీ 500 ఫ్యూచర్స్‌పై భారీ పెట్టుబడులు
ఇరాన్‌పై దాడులు ఆపుతామన్న ట్రంప్ ప్రకటనకు కొద్దిసేపటి ముందే లావాదేవీలు
ఇరాన్‌పై యుద్ధం వేళ అమెరికాలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ అనుమానాలు
న్యూఢిల్లీ, మార్చి 24: స్టాక్ మార్కెట్‌లో చాలామంది పెట్టుబడులు పెడుతుంటారు. లాభానష్టాలను చవిచూస్తుంటారు. అయితే, ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో అమెరికాలో గుర్తు తెలియని ఓ పెట్టుబడిదారు/సంస్థ స్టాక్ మార్కెట్‌లో భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టి.. కేవలం 20 నిమిషాల వ్యవధిలో ఏకంగా రూ.840 కోట్ల మేర లాభాన్ని పొందారు. ఇరాన్‌పై చేస్తున్న దాడులను ఐదు రోజుల పాటు ఆపేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడానికి 15 నిమిషాల ముందు ఈ పెట్టుబడులు పెట్టడం.. ట్రంప్ ప్రకటన చేసిన ఐదు నిమిషాల్లోపే లాభాలు ఆర్జించడం జరిగిపోయాయి. దీంతో ఈ విషయం ప్రపంచాన్నే ఆశ్చర్యపరచగా.. అమెరికా స్టాక్ మార్కెట్‌ల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరుగుతోందనే అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. అమెరికాలో స్టాక్ మార్కెట్‌లు ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమవుతాయి. కానీ, ప్రీ మార్కెట్ అవర్స్ పేరిట ఉదయం 4గంటల నుంచే మార్కెట్‌లో లావాదేవీలు చేసుకునేందుకు అవకాశముంటుంది. అయితే, న్యూయార్క్ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 6.50 సమయంలో సీఎంఈ (షికాగో మర్కంటైల్ ఎక్స్‌చేంజ్)లో ఎస్ అండ్ పీ 500 ఈ-మినీ ఫ్యూచర్స్ ధరలు భారీగా పెరిగాయి. చమురు మార్కెట్‌లు పతనమయ్యాయి. అన్‌యూజ్‌వల్ వేల్స్ అనే ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ కథనం ప్రకారం.. తమ వినియోగదారుల్లో ఒకరు ఆ సమయంలో ముడిచమురు, ఎస్ అండ్ పీ ఈ-మినీ ఫ్యూచర్స్‌పై భారీ పెట్టుబడులు పెట్టారు. తొలుత రూ.12,600 కోట్లు(1.5 బిలియన్ డాలర్లు) విలువైన ఎస్ అండ్ పీ 500 ఫ్యూచర్స్ కొనుగోలు చేశారు. అలాగే, రూ.1615 కోట్లు(192 మిలియన్ డాలర్లు) విలువైన చమురు ఫ్యూచర్ స్టాక్స్‌ను అమ్మకానికి పెట్టారు. చమురు రవాణాకు ఉన్న ఇబ్బందులు తొలగితే చమురు ధరలు దిగివస్తాయని వారి అంచనా. అక్కడికి 15 నిమిషాల తర్వాత ఉదయం 7.05 గంటలప్పుడు.. ఇరాన్ పవర్ ప్లాంట్లు, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను తాత్కాలికంగా ఆపుతున్నామని ట్రంప్.. ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు. అంతే.. ఎస్ అండ్ పీ ఫ్యూచర్స్ ధరలు (మార్కెట్‌లు ప్రారంభం కాకముందే) 2.5 శాతం మేర పెరిగిపోయాయి.
అదే విధంగా చమురు ధరలు పడిపోయాయి. బ్రెంట్ ముడిచమురు బ్యారెల్ ధర 109 డాలర్ల నుంచి కనిష్ఠంగా 92 డాలర్లకు పతనమైంది. అలాగే, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ బ్యారెల్ ధర దాదాపు 6 శాతం పతనమై 88.70 డాలర్లకు దిగింది. ఆ గుర్తు తెలియని పెట్టుబడిదారు రూ.కోట్లు కొల్లగొట్టారు. అయితే, ఇరాన్ అంశంలో ట్రంప్ నుంచి కీలక ప్రకటన వెలువడనుందనే అధికారిక సమాచారం కానీ వార్తలు కానీ లేనప్పుడు ఈ లావాదేవీలు జరగడం అనుమానాలకు తావిస్తోంది. అమెరికా మార్కెట్‌ల్లో ఇలాంటి అతి భారీ లావాదేవీలు ఇటీవల కాలంలో చాలా జరిగాయని అమెరికా బ్రోకరేజ్ మార్కెట్ స్ట్రాటసిస్ట్ ఒకరు పేర్కొన్నారు. వెనెజువెలా అధ్యక్షుడి అరెస్టుకు కొద్దిసేపటి ముందు.. వెనెజువెలాపై జనవరిలోగా అమెరికా దాడి చేయడం ఖాయముంటూ ఓ వ్యక్తి పాలీమార్కెట్‌లో దాదాపు 34,000 డాలర్లు పందెం కాశాడన్నారు. ఇలాంటి ఘటనలే అమెరికాలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సందేహాలు రేకెత్తిస్తున్నాయని వెల్లడించారు.