నేడు ప్రధాని మోదీ ప్రారంభిస్తారనగా..రాజస్థాన్ రిఫైనరీలో అగ్ని ప్రమాదం
ABN , Publish Date - Apr 21 , 2026 | 03:17 AM
రాజస్థాన్‌లోని బలోత్రా జిల్లా పచపద్రలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్), రాజస్థాన్ ప్రభుత్వ భాగస్వామ్యంతో...
జైసెల్మేర్, ఏప్రిల్ 20: రాజస్థాన్‌లోని బలోత్రా జిల్లా పచపద్రలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్), రాజస్థాన్ ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్మించిన ‘రిఫైనరీ-కం పెట్రో కెమికల్ కాంప్లెక్స్’లో సోమవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంగళవారం ప్రధాని మోదీ.. ఈ రిఫైనరీని ప్రారంభించి, జాతికి అంకితం చేయాల్సి ఉండగా ఈ ఘటన జరిగింది. దీంతో, ప్రధాని రాజస్థాన్ పర్యటన వాయిదా పడింది. ప్రమాదం ఎలా జరిగింది? అన్న విషయమ్మీద ఇంకా అధికారిక సమాచారమేదీ వెలువడలేదు. అయితే ప్రధాన రిఫైనరీలో సాంకేతిక లోపం తలెత్తడంతో క్రూడ్ డిస్టిలేషన్ యూనిట్ (సీడీయూ), వ్యాక్యూమ్ డిస్టిలేషన్ యూనిట్ (వీడీయూ)ల సమీపంలో మధ్యాహ్నం 2గంటలకు భారీ పేలుడు సంభవించింది. రిఫైనరీ వర్గాల సమాచారం ప్రకారం పేలుడు,అగ్ని ప్రమాద ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఎవ్వరూ గాయపడలేదు. కాగా దేశంలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌తో కలిపి నిర్మించిన మొట్టమొదటి రిఫైనరీ ఇదే. దీని నిర్మాణానికి 79,459 కోట్లు వెచ్చించారు.