మనాలీలో పర్యాటకుల నరకయాతన
ABN , Publish Date - Jan 26 , 2026 | 04:13 AM
హిమాచల్‌ప్రదేశ్ మంచులో ప్రకృతి అందాలను వీక్షించేందుకు వచ్చిన వేలాది మంది పర్యాటకులు గడ్డకట్టే చలిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు.
గడ్డకట్టే చలిలో 24 గంటలకు పైగా ట్రాఫిక్ జామ్
సిమ్లా/మనాలీ, జనవరి 25: హిమాచల్‌ప్రదేశ్ మంచులో ప్రకృతి అందాలను వీక్షించేందుకు వచ్చిన వేలాది మంది పర్యాటకులు గడ్డకట్టే చలిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. వరుస సెలవులు రావడంతో పర్యాటకుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ముఖ్యంగా మనాలీ, సిమ్లా వంటి పర్యాటక ప్రాంతాల్లో వాహనాలు 24గంటలకు పైగా ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోయాయి. రోడ్లపై సుమారు 7-8 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో పర్యాటకులు మైనస్ డిగ్రీల చలిలో వాహనాల్లోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. పెట్రోల్ అయిపోతుందనే భయంతో చాలా మంది వాహనాల్లోని హీటర్లు ఆపేసి, రోడ్డు పక్కనే చలిమంటలు వేసుకుని వెచ్చదనం పొందారు. చైల్ వంటి మార్గాల్లో చిక్కుకున్న వారికి కనీసం ఆహారం, నీరు కూడా అందుబాటులో లేక ఇబ్బందులు పడ్డారు. దీంతో కొందరు వాహనాలను అక్కడే వదిలేసి, కిలోమీటర్ల కొద్దీ మంచులో నడుచుకుంటూ వెళ్లారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 685 రహదారులు మూతపడినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మరోవైపు, మనాలీలోని హోటళ్లన్నీ పర్యాటకులతో నిండిపోవడంతో కొత్త వారికి ఆశ్రయం దొరకడం లేదు. మరో 3 రోజులు పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పర్యాటకులు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని కోరింది.