మేనల్లుడు అభిషేక్ అధికారాలకు దీదీ కత్తెర
ABN , Publish Date - Jun 07 , 2026 | 06:04 AM
ఎమ్మెల్యేల తిరుగుబాటు స్వరం నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. మెజారిటీ ఎమ్మెల్యేలు ...
కోల్‌కతా, జూన్ 6: ఎమ్మెల్యేల తిరుగుబాటు స్వరం నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. మెజారిటీ ఎమ్మెల్యేలు తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పెత్తనంపై ఆగ్రహంగా ఉన్న నేపథ్యంలో ఆయన అధికారాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. అభిషేక్ బెనర్జీ ప్రస్తుతం టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండగా.. ఆయనకు తోడుగా డెరెక్ ఓబ్రెయిన్, డోలా సేన్‌లను జాతీయ సంయుక్త కార్యదర్శులుగా దీదీ ప్రకటించారు. ఈ నియామకాలతో మేనల్లుడికి ప్రత్యేక అధికారాలేమీ లేవని ఆమె చెప్పకనే చెప్పినట్లయింది. సీనియర్ నేత చంద్రిమ భట్టాచార్యని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించారు. పార్టీలో తిరుగుబాటు నేపథ్యంలో దీదీ... తనకు, పార్టీకి అత్యంత నమ్మకస్థులైన వారికి కీలక బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా, బహరంపూర్ ఎంపీ, మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్‌ను రాజీనామా చేయాలని తాను అడినట్లు వచ్చిన వార్తలను బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తీవ్రంగా ఖండించారు. ‘ఇంత అసత్యమా? నిరాధారమైన, బాధ్యతారాహిత్యమైన సత్యదూర ప్రచారం ఇది. నేను ఎప్పుడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు’ అని అన్నారు.