Share News

మమత ‘కాలికి గాయం’ కట్టుకథ!

ABN , Publish Date - Oct 04 , 2026 | 05:38 AM

ఐదేళ్ల క్రితం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో నాటి సీఎం మమతా బెనర్జీ ‘కాలికి గాయం’ కట్టుకథేనని పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి ఆరోపించారు.

మమత ‘కాలికి గాయం’ కట్టుకథ!

  • నాటి ఘటనపై దర్యాప్తు జరిపిస్తాం: బెంగాల్‌ సీఎం సువేందు

కోల్‌కతా, అక్టోబరు 3: ఐదేళ్ల క్రితం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో నాటి సీఎం మమతా బెనర్జీ ‘కాలికి గాయం’ కట్టుకథేనని పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి ఆరోపించారు. ఆమె కాలి ఎముక విరిగినట్లుగా ఎటువంటి సాక్ష్యాధారాలు లేవన్నారు. ఆ ఘటనలో వాస్తవాలను వెలికి తీయటానికి దర్యాప్తు జరిపిస్తామని ప్రకటించారు. నందిగ్రామ్‌లో ఈ నెల 6వ తేదీన ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో శనివారం కోల్‌కతాలో సువేందు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. నందిగ్రామ్‌లో గాయపడినట్లు మమత చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆమెకు చికిత్స అందించిన ఆసుపత్రి ఇచ్చిన వైద్య నివేదికను ఈ సందర్భంగా సీఎం ప్రదర్శించారు. మమత కాలి ఎముక విరిగినట్లుగానీ, పక్కకు కదిలినట్లుగానీ ఈ నివేదికలో పేర్కొనలేదని చెప్పారు. అయినప్పటికీ, మమత అబద్ధాలతో కట్టుకథ అల్లారని, ఇది నందిగ్రామ్‌ ప్రజలను మోసగించటమేనన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేసి గెలిచిన సువేందు.. నందిగ్రామ్‌ స్థానానికి రాజీనామా చేయటంతో అక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మమత కాలుకు కట్టుతోనే వీల్‌చెయిర్‌లో కూర్చొని ప్రచారం నిర్వహించారు.

Updated Date - Oct 04 , 2026 | 06:40 AM