లాయర్ దీదీ
ABN , Publish Date - Feb 05 , 2026 | 03:41 AM
టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బుధవారం లాయర్ అవతారమెత్తారు. బెంగాల్‌లో ఓటర్ల జాబితా సవరణ(సర్)కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో సీజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఎదుట స్వయంగా వాదనలు వినిపించారు.
బెంగాల్‌లో ఎస్‌ఐఆర్‌పై సుప్రీంకోర్టులో స్వయంగా వాదనలు వినిపించిన మమత
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బుధవారం లాయర్ అవతారమెత్తారు. బెంగాల్‌లో ఓటర్ల జాబితా సవరణ(సర్)కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో సీజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఎదుట స్వయంగా వాదనలు వినిపించారు. తద్వారా సుప్రీంకోర్టులో వాదించిన తొలి సీఎంగా రికార్డు సృష్టించారు. ఓటర్లను చేర్చటానికి కాకుండా తొలగించే లక్ష్యంతోనే ఎస్‌ఐఆర్‌ను తీసుకొచ్చినట్లు కనబడుతోందని మమత తెలిపారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియకు సాధారణంగా రెండేళ్లు పడుతుందని, కానీ, ఎన్నికల సంఘం(ఈసీ) కేవలం 3నెలల్లో పూర్తి చేయాలని చూస్తోందన్నారు. ఒత్తిడి భరించలేక ఎస్‌ఐఆర్ ప్రక్రియలో పాలుపంచుకుంటున్న ఉద్యోగులు మరణిస్తున్నారని మమత గుర్తు చేశారు. తాను తన పార్టీ తరఫున రాలేదని, బెంగాల్‌లోని ఓ కార్మికుడి తరఫున ఇక్కడికి వచ్చానని, తమకు న్యాయం అందించాలని మమత విజ్ఞప్తి చేశారు. వాదనల మధ్యలో ఈసీ తరఫు న్యాయవాది రాకేశ్ ద్వివేది కల్పించుకోబోగా.. మమత చేతులు జోడించి ‘నన్ను మాట్లాడనివ్వండి సర్’ అని విజ్ఞప్తి చేశారు. రాకేశ్ ద్వివేది మళ్లీ ఏదో మాట్లాడబోగా.. సీజేఐ కల్పించుకుంటూ.. ‘ఇక్కడ మాట్లాడటానికి మేడమ్ చాలా దూరం నుంచి వచ్చారు’ అని పేర్కొన్నారు. కాగా, వాదనల సందర్భంగా మమతతోపాటు ఆమె తరఫు న్యాయవాదులు కపిల్ సిబల్, శ్యాం దివాన్ కూడా కోర్టు హాలులో ఉన్నారు. తనకు ఐదు నిమిషాల సమయం ఇవ్వాలని మమత విజ్ఞప్తి చేయగా.. సీజేఐ ‘5 నిమిషాలు కాదు.. 15 నిమిషాలు తీసుకోండి’ అని చెప్పారు. వాదనలు ముగించిన తర్వాత మమత.. ధర్మాసనానికి కృతజ్ఞతలు తెలియజేశారు. వాదనల కోసం మమత సుప్రీంకోర్టు ఆవరణలోకి ఉదయం 10 గంటలకు చేరుకున్నారు. మధ్యాహ్నం 12.55కి సీజేఐ ధర్మాసనం విచారణ ప్రారంభించింది.