యానాం మల్లాడిదే 4,568ఓట్ల మెజారిటీతో విజయం
ABN , Publish Date - May 05 , 2026 | 04:59 AM
కేంద్రపాలిత ప్రాంతమైన యానాం అసెంబ్లీ ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. 4,568ఓట్ల మెజారిటీ ఆరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఆరోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక
(కాకినాడ, ఆంధ్రజ్యోతి)
కేంద్రపాలిత ప్రాంతమైన యానాం అసెంబ్లీ ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. 4,568ఓట్ల మెజారిటీ ఆరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ ఎన్నికలో నియోజకవర్గంలో 35,631 ఓట్లు పోలయ్యాయి. ఎన్నార్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మల్లాడికి 19,863 ఓట్లు వచ్చాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్‌కు 15,295మంది ఓటేశారు. టీవీకే విజయ్ పార్టీ తరఫున పోటీ చేసిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన తోటరాజుకు 167 ఓట్లు లభించాయి. నోటాకు 195ఓట్లు వచ్చాయి. ఎన్డీయే కూటమి పుదుచ్చేరిలో తిరిగి అధికారం దక్కించుకోవడంతో మల్లాడికి మంత్రి పదవి ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా, యానాం ఫలితం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీని తీవ్ర నిరాశకు గురి చేసింది. మల్లాడికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అభ్యర్థి అశోక్‌ను గెలిపించడానికి కాకినాడ సిటీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి, మరో వైసీపీ ఎమ్మెల్సీ, మరో మాజీ మంత్రి కలిసి అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. అయితే, మల్లాడికి కాకినాడ సిటీ, ముమ్మిడివరం టీడీపీ ఎమ్మెల్యేలు సహకరించారు. మల్లాడి విజయం సాధించడడంతో స్థానిక టీడీపీ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. .