Share News

సర్‌ లెక్కలు తేల్చడానికి వచ్చిన న్యాయాధికారులపై దాడి

ABN , Publish Date - Apr 03 , 2026 | 04:11 AM

బెంగాల్లో ఓటర్ల జాబితా ప్రక్షాళన(ఎస్ఐఆర్‌) ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం పక్కన బెట్టిన 60 లక్షల ఓటర్ల వివాదాన్ని తేల్చడానికి సుప్రీంకోర్టు నియమించిన న్యాయాధికారులను బుధవారం రాత్రి మాల్దా జిల్లాలోని ఒక ......

సర్‌ లెక్కలు తేల్చడానికి వచ్చిన న్యాయాధికారులపై దాడి

  • 9 గంటల పాటు నిర్బంధించిన ఆందోళనకారులు

  • పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లాలో సంఘటన

  • సుప్రీం తీవ్ర ఆగ్రహం.. సీబీఐ దర్యాప్తునకు ఆదేశం

  • బీజేపీ మద్దతుతో ఒవైసీ, కబీర్‌ల పనేనన్న మమత

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 2: బెంగాల్లో ఓటర్ల జాబితా ప్రక్షాళన(ఎస్ఐఆర్‌) ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం పక్కన బెట్టిన 60 లక్షల ఓటర్ల వివాదాన్ని తేల్చడానికి సుప్రీంకోర్టు నియమించిన న్యాయాధికారులను బుధవారం రాత్రి మాల్దా జిల్లాలోని ఒక ప్రభుత్వ కార్యాలయంలో కొన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు చుట్టుముట్టి ఘెరావ్‌ చేశారు. సాయంత్రం 4 గంటల నుంచి దాదాపు 9 గంటల పాటు గదిలోంచి బయటకు రాకుండా నిర్బంధించారు. నిర్బంధానికి గురైన వారిలో మహిళలు, పిల్లలు ఉన్నారు. పోలీసు బలగాలు వచ్చి, వారిని బయటకు తీసుకెళ్తున్నపుడు ఆందోళనకారులు కార్యాలయంలో విధ్వంసానికి పాల్పడటమే కాకుండా కాన్వాయ్‌పై రాళ్లు రువ్వారు. ఈ సంఘటనపై గురువారం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బెంగాల్‌ను దేశంలోకెల్లా అత్యంత రాజకీయ ప్రేరేపితమైన రాష్ట్రంగా అభివర్ణించింది. శాంతి భద్రతలను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అభిప్రాయపడింది. మీపై ఎందుకు చర్య తీసుకోరాదో చెప్పాలని బెంగాల్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ప్రశ్నించింది. మాల్దా జిల్లాలో న్యాయాధికారుల ముందు జరిగిన నిరసన అధికారుల ఎరికలో పథకం ప్రకారం జరిగిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ అభిప్రాయపడ్డారు. ఇది సుప్రీంకోర్టు అధికారాన్ని సవాలు చేయడమేనని అన్నారు. మధ్నాహ్నం 3.30 గంటలకే కోల్‌కతా హైకోర్టు రిజిస్ట్రార్‌ మాల్దాలో నెలకొన్న పరిస్థితిని పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించారని, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము బుధవారం అర్థరాత్రి రెండు గంటల వరకు కూర్చొని మాల్దాలో పరిస్థితిని సమీక్షించామని చెప్పారు. దాడి రాజకీయ ప్రేరేపితం కాదని రాష్ట్ర ప్రభుత్వం చేసిన వాదననను తోసిపుచ్చారు. ఈ సంఘటనపై సీబీఐ లేదా ఎన్‌ఐఏ దర్యాప్తు జరపాలని ఆదేశించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఫిబ్రవరి 20వ తేదీ నుంచి బెంగాల్‌, ఒడిసా, జార్ఖండ్‌లకు చెందిన 700 మంది న్యాయాధికారులు ఎన్నికల సంఘం సర్‌ ప్రక్రియలో భాగంగా తొలగించిన 60 లక్షల మంది ఓటర్ల వివరాలను పరిశీలిస్తున్నారు. న్యాయాధికారుల మీద దాడిని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఖండించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేందుకు బీజేపీ కుట్ర పన్నిందని వ్యాఖ్యానించారు. న్యాయాధికారులను సంరక్షించడంలో ఈసీ విఫలమైందన్నారు. హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఒవైసీ, బీజేపీ డబ్బుతో బెంగాల్‌ల్లో మైనారిటీ రాజకీయాలు చేస్తున్న హుమాయున్‌ కబీర్‌ న్యాయాధికారులకు వ్యతిరేకంగా హింసను రెచ్చగొడుతున్నారని మమత ఆరోపించారు.

Updated Date - Apr 03 , 2026 | 04:11 AM