ఝార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్
ABN , Publish Date - Jan 23 , 2026 | 03:56 AM
ఝార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో భద్ర తా బలగాలు, మావోయిస్టుల మధ్య గురువారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది.
16 మంది మావోయిస్టుల మృతి
మృతుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు అనల్‌దా
ఆయనపై రూ.2.35 కోట్ల రివార్డు
చైబాసా, జనవరి 22: ఝార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో భద్ర తా బలగాలు, మావోయిస్టుల మధ్య గురువారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో 16 మంది మావోయిస్టులు మరణించారు. మృతుల్లో పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు పతిరామ్ మాంజీ అలియాస్ అనల్‌దాతోపాటు ఐదుగురు మహిళలు కూడా ఉన్నారు. ఈ ఎన్‌కౌంటర్ వివరాలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఎక్స్ వేదికగా ప్రకటించారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు అనల్‌దాతోపాటు 16 మంది ఇప్పటిదాకా ఎన్‌కౌంటర్‌లో మరణించారని వెల్లడించారు. మిగిలిన మావోయిస్టులు జనజీవనంలోకి రావాలని పిలుపునిచ్చారు. 1987 నుంచి మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్న అనల్‌దాపై రూ.2.35 కోట్ల రివార్డు ఉంది. అతని కోసం పోలీసులు చాలాకాలంగా గాలిస్తున్నారు. సీఆర్‌పీఎఫ్ అధికారుల కథనం ప్రకారం.. అనల్‌దా ఆచూకీపై అందిన సమాచారం మేరకు సీఆర్‌పీఎఫ్ కోబ్రా విభాగానికి చెందిన 1500 మంది సిబ్బంది సారండా అడవుల్లో మంగళవారం నుంచి గాలింపు చేపట్టారు. అయితే, గురువారం ఉదయం ఆరు గంటల సమయంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి. ఈ కాల్పుల్లో అనల్‌దా, బిహార్-ఝార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ(బీజేఎ్‌సఏసీ) సభ్యుడు అన్మోల్ అలియాస్ సుశాంత్ సహా 16 మంది మావోయిస్టులు మరణించగా వారి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 11 మందిని గుర్తించారు. 149 కేసుల్లో నిందితుడైన అన్మోల్‌పై రూ.90లక్షల రివార్డు ఉంది. ఘటనాస్థలంలో పెద్ద సంఖ్యలో ఆయుధాలు, ఆయుధ సామగ్రిని కూడా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. కాగా, మావోయిస్టుల కోసం గాలింపు కొనసాగుతోందని, ఝార్ఖండ్‌లో మరో 60 నుంచి 65 మంది మావోయిస్టులు మాత్రమే మిగిలి ఉన్నారని, మిసిర్ బెస్రా మినహా కేంద్ర కమిటీ సభ్యులంతా హతమయ్యారని సీఆర్‌పీఎఫ్ ఐజీ సాకేత్ కుమార్ సింగ్ ప్రకటించారు. 2026 మార్చి 31 నాటికి మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పలుమార్లు ప్రకటనలు చేశారు. ఈ నేపథ్యంలో 2021 నుంచి 2025 మధ్యలో ఝార్ఖండ్‌లో 250 మంది మావోయిస్టులు కాల్పుల్లో మృతి చెందగా, 11,000 మందికి పైగా అరెస్టయ్యారు.