Share News

ధర్మేంద్ర ప్రధాన్‌ అవుట్‌?

ABN , Publish Date - Jun 26 , 2026 | 03:57 AM

కేంద్ర మంత్రివర్గంలో త్వరలో భారీ మార్పులు జరగనున్నాయి. అందులో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు శాఖ మార్పు ఉంటుందని....

ధర్మేంద్ర ప్రధాన్‌ అవుట్‌?

  • నిర్మల ఆర్థిక మంత్రి పదవి డౌట్‌.. మంత్రివర్గంలో మార్పులు!

  • రాష్ట్రపతితో అమిత్‌ షా భేటీ

న్యూఢిల్లీ, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): కేంద్ర మంత్రివర్గంలో త్వరలో భారీ మార్పులు జరగనున్నాయి. అందులో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు శాఖ మార్పు ఉంటుందని, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఏకంగా పదవి నుంచి తప్పిస్తారని ఊహాగానాలు వినపడుతున్నాయి. పలువురు క్యాబినెట్‌ మంత్రుల శాఖలు మారతాయని, అనేక మంది సహాయ మంత్రులకు ఉద్వాసన పలుకుతారని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో గట్టి చర్చ జరుగుతోంది. ప్రధాని మోదీ శుక్ర, శని, ఆదివారాల్లో సీషెల్స్‌ పర్యటనకు వెళ్తున్నారు. ఆయన తిరిగి రాగానే ఏ రోజైనా ఈ మార్పులు ఉంటాయని భావిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ప్రధాని బుధవారం తొమ్మది మంది సహాయ మంత్రులతో వారి మంత్రివర్గ శాఖల పనితీరు గురించి సమీక్షించారు. వారిలో హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ కూడా ఉన్నారు. గత రెండు రోజులుగా రాజ్‌నాథ్‌ సింగ్‌ నివాసంలో అమిత్‌ షా, పీయూష్‌ గోయెల్‌ తదితరులు కూడా మంతనాలు జరపడంతో ఏవో కీలక మార్పులు జరుగుతున్నాయన్న అభిప్రాయాలకు ఆస్కారం ఏర్పడింది.

Updated Date - Jun 26 , 2026 | 03:57 AM