Share News

సీఈసీపై మహువా మొయిత్రా పోలీసులకు ఫిర్యాదు

ABN , Publish Date - Sep 25 , 2026 | 05:57 AM

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌పై టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా గురువారం ఢిల్లీలోని పార్లమెంట్‌ స్ట్రీట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సీఈసీపై మహువా మొయిత్రా పోలీసులకు ఫిర్యాదు

  • సర్‌ ప్రక్రియలో నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపణలు

  • జ్ఞానేశ్‌కుమార్‌ దొంగ అంటూ టీఎంసీ ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 24: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌పై టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా గురువారం ఢిల్లీలోని పార్లమెంట్‌ స్ట్రీట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సర్‌ ప్రక్రియలో ఆయన విధానపరమైన ఉల్లంఘనలకు పాల్పడ్డారని, ఏకపక్ష నిర్ణయాలతో ఓటర్ల జాబితాలను తారుమారు చేశారని ఫిర్యాదులో ఆరోపించారు. ఈ మేరకు ఆయనపై కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఈ దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ అయిన ‘దొంగ’ జ్ఞానేశ్‌ కుమార్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశా. ఎన్నికల కమిషన్‌ సమష్టిగా పనిచేసినప్పుడే కమిషనర్లకు సివిల్‌, క్రిమినల్‌ విచారణల నుంచి మినహాయింపు లభిస్తుంది. ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తే ఆ రక్షణ వర్తించదు. జ్ఞానేశ్‌ తీసుకున్న నిర్ణయాలపై 10 నెలల్లో 14 సార్లు తోటి కమిషనర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జ్ఞానేశ్‌ నిర్ణయాలు మెజారిటీ నిర్ణయాలు కావు. అందువల్ల ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు, దర్యాప్తును ఏదీ ఆపలేదు. సర్‌ ప్రక్రియ కోసం కోట్లాది రూపాయల ప్రజా ధనం దుర్వినియోగమైంది. జ్ఞానేశ్‌ ఓ ఏజెంట్‌లా వ్యవహరించారు’ అని దుయ్యబట్టారు. దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది, పశ్చిమ బెంగాల్‌లో 33 లక్షల మందిని ఓటర్ల జాబితా నుంచి అక్రమంగా తొలగించారని ఆమె ఆరోపించారు.

Updated Date - Sep 25 , 2026 | 05:58 AM