Share News

వరకట్న వేధింపులకు మహిళా రెజ్లర్‌ బలి

ABN , Publish Date - Sep 05 , 2026 | 04:57 AM

మహారాష్ట్రలోని ధారాశివ్‌ జిల్లాలో ఘోరం జరిగింది. అశ్విని మనోహర్‌ పాల్‌ (30) అనే జాతీయ స్థాయి మహిళా రెజ్లర్‌ తన కుమారుడు, కవల కుమార్తెలతో కలిసి ఖిల్లా నల్‌దుర్గ్‌ పైనుంచి 100 అడుగుల లోయలోకి దూకేసింది.

వరకట్న వేధింపులకు మహిళా రెజ్లర్‌ బలి

  • ముగ్గురు పిల్లలతో కలిసి ఖిల్లాపై నుంచి దూకిన రెజ్లర్‌

  • ఆమె, ఇద్దరు పిల్లలు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు

  • మహారాష్ట్రలోని ధారాశివ్‌ జిల్లాలో ఘటన

  • కవల కూతుళ్లు పుట్టారని డబ్బు, బంగారం తేవాలని ఆమెకు భర్త వేధింపులు

  • పోలీసులకు మృతురాలి తండ్రి ఫిర్యాదు

ముంబై, సెప్టెంబరు 4: మహారాష్ట్రలోని ధారాశివ్‌ జిల్లాలో ఘోరం జరిగింది. అశ్విని మనోహర్‌ పాల్‌ (30) అనే జాతీయ స్థాయి మహిళా రెజ్లర్‌ తన కుమారుడు, కవల కుమార్తెలతో కలిసి ఖిల్లా నల్‌దుర్గ్‌ పైనుంచి 100 అడుగుల లోయలోకి దూకేసింది. ఈ ఘటనలో ముగ్గురు.. తల్లి, ఆమె ఐదున్నరేళ్ల కుమారుడు అజింక్యా, రెండున్నరేళ్ల కవల కుమార్తెల్లో ఒకరైన క్రాంతి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. మరో కుమార్తె వీరా తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అశ్విని జాతీయ స్థాయిలో ఐదు స్వర్ణ, ఆరు రజత పతకాలు గెలుచుకున్నారు. కాగా తొలుత ఈ ఘటనను ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా పోలీసులు అనుకున్నారు. అయితే భర్త మనోహర్‌ పాల్‌, మామ అంకుశ్‌ పాల్‌ వేధింపులను భరించలేకే తన కూతురు ఈ ఘటనకు పాల్పడిందని అశ్విని తండ్రి తనాజీ మొహతే ఆరోపించారు. ఆమెను పుట్టింటికి వెళ్లి కట్నంగా డబ్బు, బంగారు గాజులు తీసుకురావాలని.. ఆటోరిక్షా కొనేందుకు డబ్బు సమకూర్చాలని భర్త వేధించేవాడని ఫిర్యాదులో తనాజీ పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదైంది. ఈ ఘటనలో ఇప్పటిదాకా ఎవరినీ పోలీసులు అరెస్టు చేయలేదు.

Updated Date - Sep 05 , 2026 | 04:59 AM