180 మందిపై అత్యాచారం!
ABN , Publish Date - Apr 16 , 2026 | 03:32 AM
మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. 19 ఏళ్ల యువకుడు.. మైనర్ బాలికలను ప్రేమ పేరిట ట్రాప్ చేసి, వారిని అశ్లీలంగా వీడియోలు తీశాడు.
350 అశ్లీల వీడియోలు
ప్రేమ పేరిట ట్రాప్ చేసి ఆపై అఘాయిత్యం
వీడియోలు తీసి బ్లాక్ మెయిల్.. ఆన్‌లైన్‌లో షేర్
మహారాష్ట్రలో 19 ఏళ్ల యువకుడి దురాగతం
ముంబై, ఏప్రిల్ 15: మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. 19 ఏళ్ల యువకుడు.. మైనర్ బాలికలను ప్రేమ పేరిట ట్రాప్ చేసి, వారిని అశ్లీలంగా వీడియోలు తీశాడు. వాటిని ఆన్‌లైన్‌లో షేర్ చేశాడు. ఇలా దాదాపు 180 మంది బాలికలను లైంగికంగా వేధించాడని.. 350కిపైగా వీడియోలు చిత్రీకరించాడనే ఆరోపణలతో మహారాష్ట్రలోని అమరావతి జిల్లాకు చెందిన అయాన్ అహ్మద్ తన్వీర్‌ను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై పోక్సో చట్టంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కోర్టు అతనికి ఈ నెల 21వరకూ డిమాండ్ విధించింది. తన్వీర్ దాదాపు 180 మంది బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నప్పటికీ.. పోలీసులు మాత్రం ఇప్పటివరకూ 8 మంది బాధితులనే గుర్తించారు. పోలీసులు అతని మొబైల్ ఫోన్‌లో పలు వీడియోలను స్వాధీనం చేసుకున్నారు. అయాన్ మైనర్ బాలికలను టార్గెట్ చేసి వారితో స్నేహం చేసేవాడని, ఆపై ప్రేమ పేరుతో ట్రాప్ చేసేవాడని పోలీసులు విచారణలో తేలింది. ఆ తర్వాత వారిపై లైంగికంగా దగ్గరయ్యేవాడని, ఈ క్రమంలో అనుమతి లేకుండా వీడియోలు తీసేవాడని వెల్లడైంది. అనంతరం ఆ వీడియోలు చూపించి వారిని బ్లాక్‌మెయిల్ చేసేవాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఉజర్ ఖాన్ అనే మరో యువకుడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. అతను తన మొబైల్ ఫోన్ నుంచి ఇలాంటి అశ్లీల వీడియోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసినట్టు ఆరోపణలున్నాయి.
రాజకీయ దుమారం..
అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని మజ్లిస్ (ఎంఐఎం) పార్టీతో నిందితుడు తన్వీర్‌కు సంబంధం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ కేసు రాజకీయ రంగు పులుముకుంది. తన్వీర్‌కు ఆ పార్టీతో సంబంధాలున్నాయని, స్థానిక ఎన్నికల సమయంలో అతను పార్టీ సోషల్ మీడియా కార్యకలాపాల్లో కూడా పాల్గొన్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు సిట్‌ను ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకుడు కిరిట్ సోమయ్య సీఎం ఫడ్నవీస్ను కోరారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పరత్వాడ, అచల్‌పూర్ ప్రాంతాల్లో ప్రజలు నిరసనలు చేపట్టారు. హిందూ సంఘాల ఆధ్వర్యంలో బంద్ పాటించారు. ఇదిలా ఉండగా.. నిందితుడు అయాన్ అహ్మద్ తన్వీర్ ఇంటిపై మహారాష్ట్ర ప్రభుత్వం బుల్డోజర్ ఆపరేషన్ చేపట్టింది. అతని ఇంటితోపాటు సమీపంలోని అక్రమ కట్టడాలను సైతం స్థానిక మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. బీజేపీ ఎమ్మెల్యే ప్రవీణ్ తాయడే పర్యవేక్షణలో ఈ కూల్చివేతలు చేపట్టారు. అక్రమ నిర్మాణానికి సంబంధించి నిందితుడి కుటుంబానికి గతంలోనే నోటీసులు జారీ చేశామని, దానిపై ఎలాంటి స్పందనా రాకపోవడంతో కూల్చివేత చేపట్టామని మున్సిపల్ అధికారులు తెలిపారు.