Share News

మహారాష్ట్రలో ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్లు రద్దు

ABN , Publish Date - Feb 19 , 2026 | 03:57 AM

మహారాష్ట్రలో ముస్లింలకు విద్య, ఉద్యోగాల్లో కల్పించిన 5 శాతం రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

మహారాష్ట్రలో ముస్లింలకు 5 శాతం  రిజర్వేషన్లు రద్దు

ముంబై, ఫిబ్రవరి 18: మహారాష్ట్రలో ముస్లింలకు విద్య, ఉద్యోగాల్లో కల్పించిన 5 శాతం రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 2014 జులైలో అప్పటి కాంగ్రెస్‌- ఎన్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో మరాఠాలకు 16 శాతం, ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్సు జారీ చేసింది. ముస్లింలను ప్రత్యేక వెనకబడిన తరగతుల (బీసీ-ఏ) జాబితాలో చేర్చి రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించింది. కానీ ఆ ఆర్డినెన్సును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై 2014 నవంబర్‌లో బాంబే హైకోర్టు స్టే విధించింది. ఆర్డినెన్సు గడువు ముగియడంతో పాటు సుప్రీంకోర్టు కూడా ఆ కోటా చెల్లదని ప్రకటించడంతో ఆ రిజర్వేషన్లు అమలులోకి రాలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఆనాటి ఉత్తర్వులను అధికారికంగా రద్దు చేయలేదు. ముస్లింలకు కల్పించిన 5 శాతం రిజర్వేషన్లు రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది. అలాగే ఆ కోటాకు సంబంధించి కుల ధ్రువీకరణ, నాన్‌- క్రీమీలేయర్‌ పత్రాల జారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

Updated Date - Feb 19 , 2026 | 03:57 AM