Share News

మహారాష్ట్రలో భయానక కరువు!

ABN , Publish Date - Sep 27 , 2026 | 05:42 AM

మహారాష్ట్రలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలోని 358 తాలూకాలలో 265 తాలూకాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించింది.

మహారాష్ట్రలో భయానక కరువు!

  • 265 తాలూకాలు కరువు ప్రాంతాలుగా ప్రకటన

  • ఏకంగా 74శాతం భూభాగంపై ప్రభావం

  • అన్నదాతలను ఆదుకునేందుకు రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయాలు

ముంబై, సెప్టెంబరు 26: మహారాష్ట్రలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలోని 358 తాలూకాలలో 265 తాలూకాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. దీనివల్ల రాష్ట్రంలోని దాదాపు 74 శాతం భూభాగం కరువు బారిన పడినట్లు ప్రభుత్వంశనివారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ ఏడాది జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 18.8శాతం వర్షపాతం లోటు నమోదు కావడమే ఈ పరిస్థితికి కారణం. ప్రభుత్వం ‘కరువు నిర్వహణ నిబంధనావళి 2016’ ప్రకారం ‘ట్రిగ్గర్‌-1’ను అమలు చేస్తూ కరువు ప్రకటన చేసింది. కరువు ప్రాంతాల్లోని ప్రజలను ఆదుకునేందుకు తక్షణ సహాయక చర్యలకు ఉపక్రమించింది. రైతుల పంట రుణాల వసూళ్లను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ పంపుసెట్లకు ఉపయోగించే విద్యుత్‌ బిల్లులపై ప్రత్యేక రాయితీలు కల్పించనున్నారు. పశువులకు గ్రాసం అందించేలా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. కరువు ప్రభావిత ప్రాంతాల్లోని పాఠశాల, కళాశాల విద్యార్థులకు పరీక్షల ఫీజులను పూర్తిగా మినహాయించారు.

Updated Date - Sep 27 , 2026 | 05:44 AM