9 మంది పోలీసులకు మరణశిక్ష
ABN , Publish Date - Apr 07 , 2026 | 04:55 AM
తమ కస్టడీలో ఉన్న తండ్రి, కొడుకులను పోలీసులు అత్యంత పాశవికంగా కొట్టి హత్య చేసిన కేసులో తమిళనాడులోని మదురై కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
తలా రెండు చొప్పున మరణదండనలు
తమిళనాడులోని సాత్తాన్‌కుళం తండ్రీకొడుకుల లాక్‌పడెత్ కేసులో మదురై కోర్టు సంచలన తీర్పు
బాధిత కుటుంబానికి ఆ 9 మంది 1.40 కోట్ల పరిహారం చెల్లించాలని ఆదేశాలు
చెన్నై, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): తమ కస్టడీలో ఉన్న తండ్రి, కొడుకులను పోలీసులు అత్యంత పాశవికంగా కొట్టి హత్య చేసిన కేసులో తమిళనాడులోని మదురై కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషులుగా తేలిన తొమ్మిది మంది పోలీసు అధికారులకు రెండేసి మరణశిక్షలు విధించింది. అంతేగాక బాధిత కుటుంబసభ్యులకు దోషులైన ఆ పోలీసు అధికారులు 1.40 కోట్ల నష్టపరిహారం కింద చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు జడ్జి జి.ముత్తుకుమరన్ సోమవారం తీర్పు ఇచ్చారు. ఇది అరుదైన కేసుల్లోనే అత్యంత అరుదైన కేసు అని ఈ సందర్భంగా జడ్జి వ్యాఖ్యానించారు. శాంతిభద్రతలను రక్షించాల్సిన పోలీసులే చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఏవిధమైన నేరచరిత్ర లేని తండ్రీ కొడుకులు జయరాజ్ (58), బెనిక్స్ (31)లను పోలీసులు కస్టడీలో దారుణంగా కొట్టారని చెప్పారు. సెక్షన్ 342, 195, 211, 218, 302 రెడ్‌విత్ 109, 34 ఐపీసీ సెక్షన్ల కింద నమోదైన ఈ కేసులో మొత్తం 9మంది పోలీసు అధికారులను దోషులుగా తేలుస్తూ మార్చి 23న కోర్టు తీర్పు చెప్పింది.
లాక్‌డౌన్‌లో షాపులు తెరవడంతోనే..
తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా సాత్తాన్‌కుళంలో 2020 జూన్ 19న తండ్రీ కొడుకులు జయరాజ్, బెనిక్స్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. వాళ్లు చేసిన తప్పేమిటంటే.. కొవిడ్ సమయంలో అనుమతించిన లాక్‌డౌన్ నిబంధనలను మించి వారి సెల్‌ఫోన్‌ల షాప్ తెరిచి ఉంచడమే. తండ్రీ కొడుకులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ పేరుతో వారిని రాత్రంతా లాక్‌పలో ఉంచి పాశవికంగా కొట్టారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ మరునాడు కోవిల్‌పట్టి సబ్‌జైలులో పెట్టారు. స్పృహలేని స్థితిలో ఉన్న ఆ ఇద్దరినీ జూన్ 22వ తేదీన కోవిల్‌పట్టి ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అదే రోజు బెనిక్స్, 23వ తేదీన జయరాజ్ కన్నుమూశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసుల దారుణకాండను ప్రజలంతా ఖండించారు. వాణిజ్య సంఘాలు నిరసనలు, ఆందోళనలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో 10 మంది పోలీసులపై కేసు నమోదైంది. ఈ అంశాన్ని మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ సుమోటోగా తీసుకుంది. కేసులో ప్రాథమిక సమాచారం మేరకు పోలీసులపై హత్యానేరం మోపడానికి తగిన ఆధారాలు ఉన్నాయని సుమోటో విచారణ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. కేసుకు సంబంధించిన ఆధారాలు కూడా చెరిపేయడానికి పోలీసులు ప్రయత్నించారని చెప్పింది. తక్షణం కేసు దర్యాప్తును చేపట్టాలని డీఎస్పీని, సీబీసీఐడీని కోర్టు ఆదేశించింది. ఆ తర్వాత దర్యాప్తు సక్రమంగా జరగడానికి కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. ఈ వ్యవహారంలో దర్యాప్తు చేపట్టిన సీబీఐ... పోలీసు ఇన్స్‌పెక్టర్ శ్రీధర్, సబ్ ఇన్స్‌పెక్టర్లు బాలకృష్ణన్, రఘుగణేశ్, పాల్‌దురై, హెడ్ కానిస్టేబుల్ మురుగన్, కానిస్టేబుళ్లు ముత్తురాజా, చెల్లదురై, థామస్ ఫ్రాన్సిస్, వెయిల్‌ముత్తు, సామిదురైలను అదే ఏడాది చివరలో అరెస్టు చేసి, మదురై కేంద్ర కారాగారానికి తరలించింది. అనంతరం ఎస్సై పాల్‌దురై కరోనాతో జైల్లోనే మృతిచెందాడు.
పైశాచికంగా కొట్టారు
హైకోర్టు పర్యవేక్షణలో సాగిన ఈ కేసు విచారణలో 1,500 పేజీలతో కూడిన చార్జిషీటును సీబీఐ దాఖలు చేసింది. బాధితుల ఒంటిపై ఉన్న గాయాలు దారుణంగా ఉన్నాయని తీర్పు పాఠం చదివిన సందర్భంగా జడ్జి పేర్కొన్నారు. అవి సహజమైనవి కావన్నారు. ఆ గాయాలతోనే వారు మృతి చెందారని స్పష్టం చేశారు. ఆ గాయాలు బాధితులే స్వయంగా చేసుకున్నారన్న వాదనను జడ్జి నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. మళ్లీ మళ్లీ కొట్టడం వల్లే అంత ఘోరంగా గాయాలు అయ్యాయని పోస్టుమార్టం నివేదిక వెల్లడించినట్లు చెప్పారు. జయరాజ్ గుండె సంబంధిత రోగి అయినా కూడా ఆయన మృతికి ఆ జబ్బు కారణం కాదని, పోలీసులు పదేపదే చితకబాదడమే కారణమని జడ్జి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జడ్జి తీవ్రంగా స్పందించారు. ‘‘ఇది సాధారణ నేరం కాదు. కేవలం చిన్నపాటి నిబంధనలు ఉల్లంఘించారన్న ఏకైక కారణంతో, నిరాయుధులైన ఆ ఇద్దరినీ ఒక రాత్రంగా పోలీసు స్టేషన్‌లో ఉంచి, బట్టలూడదీసి విచక్షణారహితంగా, పైశాచికంగా దాడి చేశారు. కక్షసాధింపు చర్యగా ఈ ఘటన కనిపిస్తోంది. తండ్రీకొడుకులకు పెట్టిన చిత్రహింసల గురించి చదువుతుంటే తీవ్ర దిగ్ర్భాంతికలుగుతోంది. స్టేషన్‌లో రాత్రి 7.40 నుంచి మరునాడు వేకువజామున 3 గంటల వరకు లాఠీలతో తీవ్రంగా కొట్టినట్లు తేలింది. లాకప్ గోడలకు కూడా రక్తపు చారలు అంటిఉన్నాయంటే పరిస్థితి గ్రహించవచ్చు. ఈ కేసు అరుదైన కేసుల్లో అత్యంత అరుదైనది. పోలీసుల్లో ఎవరు ఎక్కువ చిత్రహింసలు పెట్టారన్న వ్యత్యాసం చూడాల్సిన అవసరం లేదు. ప్రస్తుత దోషులకు కేవలం యావజ్జీవ కారాగారశిక్షతో సరిపెడితే.. ఇలాంటి నేరాలకు పాల్పడేవారికి భయం లేకుండా పోతుంది’’ అని పేర్కొన్నారు. పోలీసుల నుంచి వసూలు చేసిన జరిమానాను మృతుడు బెనిక్స్ మాతృమూర్తికి అందజేయాలని న్యాయాధికారి తన తీర్పులో ఆదేశించారు. కాగా, 2022 నుంచి ఇప్పటి వరకూ తమిళనాడు పోలీసులు చిత్రహింసలకు 24 మంది బలయ్యారు. ఇందులో 17 ఏళ్ల బాలుడు కూడా ఉండడం గమనార్హం.