ఆ బంధంలో మహిళకు భార్య హోదా
ABN , Publish Date - Jan 22 , 2026 | 03:19 AM
సహజీవన (లివింగ్ టుగెదర్) సంబంధాల్లో, మహిళలకు గాంధర్వ/ప్రేమ వివాహం కింద ‘భార్య’ హోదా కల్పించడం ద్వారా వారిని రక్షించాలని మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం అభిప్రాయపడింది.
గాంధర్వ/ ప్రేమ వివాహంగా పరిగణన
అప్పుడే ఆమెకు రక్షణ దొరుకుతుంది
సహజీవన సంబంధాలపై మద్రాస్ హైకోర్టు సూచన
చెన్నై, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): సహజీవన (లివింగ్ టుగెదర్) సంబంధాల్లో, మహిళలకు గాంధర్వ/ప్రేమ వివాహం కింద ‘భార్య’ హోదా కల్పించడం ద్వారా వారిని రక్షించాలని మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం అభిప్రాయపడింది. అప్పుడే ఆ సంబంధంలో సమస్యలున్నా, ఆమె ‘భార్య’ హోదాతో తట్టుకోగలుగుతుందని పేర్కొంది. పెళ్లి చేసుకుంటానని ఓ యువతిని మాయమాటలతో నమ్మించి సహజీవనం చేసిన ఓ యువకుడు ముందస్తు బెయిలు కోరుతూ దాఖలుచేసిన పిటిషన్ కొట్టివేస్తూ న్యాయమూర్తి జస్టిస్ ఎస్.శ్రీమతి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రాచీన భారతదేశంలో ఉన్న 8 రకాల వివాహాల్లో ఒకటి గాంధర్వ వివాహం. అదే ప్రేమ వివాహం. సహజీవన సంబంధాలను ఆ వివాహాలుగా గుర్తించవచ్చు. అమ్మాయిలు తాము ఆధునికులమని భావించి సహజీవన సంబంధాన్ని ఎంచుకుంటున్నారు. కొంతకాలం తర్వాత వివాహం ద్వారా లభించే రక్షణ ఏదీ సహజీవనంలో లభించదని వారు గ్రహించినప్పుడు, వాస్తవం నిప్పులా వారిని దహించడం ప్రారంభిస్తుంది. ఇలాంటి వ్యవహారాల్లో మహిళలకు రక్షణ కల్పించేది బీఎన్‌ఎ్‌సలోని సెక్షన్ 68 మాత్రమే. ఈ సెక్షన్ కింద నమోదైన కేసుల్లో పురుషులు బీఎన్‌ఎస్ సెక్షన్ 69 కింద విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని న్యాయమూర్తి స్పష్టం చేశారు.