దేవుని ముందు అందరూ సమానులే
ABN , Publish Date - May 30 , 2026 | 03:19 AM
దేవుని ముందు అందరూ సమానులే. అలాంటప్పుడు వీఐపీ దర్శనాలెందుకు? ఇతర భక్తులను వేచివుండేలా చేస్తూ వీఐపీల కోసం ఆలయాల్లో..
అలాంటప్పుడు వీఐపీ దర్శనాలెందుకు?
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మద్రాస్ హైకోర్టు
చెన్నై, మే 29(ఆంధ్రజ్యోతి): ‘దేవుని ముందు అందరూ సమానులే. అలాంటప్పుడు వీఐపీ దర్శనాలెందుకు? ఇతర భక్తులను వేచివుండేలా చేస్తూ వీఐపీల కోసం ఆలయాల్లో ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేయడం ఏమేరకు సమంజసం?’ అని మద్రాస్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వృద్ధులు, దివ్యాంగులు, ఆలయ కళాకారులు, నూత న వధూవరులు, దేశాధినేతలు, రాజ్యాంగబద్ధ అధికారు లు, గర్భిణులు తదితరులకు మినహాయింపునిస్తూ, ఆలయాల్లో వీఐపీ, ప్రత్యేక దర్శనాలను రద్దు చేయాలని కోరు తూ దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జీఆర్ స్వామినాథన్, జస్టిస్ వి.లక్ష్మీనారాయణన్‌ల ధర్మాసనం విచారణ జరిపింది. మంత్రు లు, ఎమ్మెల్యేలు ఎప్పుడు గుడిలోకి వెళితే అప్పుడు వారి కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడని అనుకోవద్దని, మనకు వీఐపీ దర్శనం ఎందుకని ప్రశ్నించింది. పిటిషనర్ వీహెచ్‌పీ నాయకుడు పి.చొక్కలింగం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ సనాతన ధర్మం.. కులం లేదా భౌతిక సంపద ఆధారంగా వివక్ష చూపదని, సనాతన ధర్మం ముందు అంతా సమానులేనని చెప్పారు.
ఎన్నికల ప్రచారానికి పిల్లల్ని వాడుకోవడం తప్పు
ఎన్నికల ప్రచారానికి పిల్లల్ని వాడుకోవడం తప్పు అని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో టీవీకే సహా పలు రాజకీయ పార్టీలు పిల్లల్ని ప్రచారానికి వినియోగించుకున్నాయని ఆరోపిస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై శుక్రవారం న్యాయమూర్తులు జస్టిస్ జీఆర్ స్వామినాధన్, జస్టిస్ వి.లక్ష్మీనారాయణన్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి స్వామినాధన్ స్పందిస్తూ.. తాను ఓటేసేందుకు పోలింగ్ బూత్‌కు వెళ్తుండగా.. తన మనవడు విజయ్‌కే ఓటు వేయాలని కోరాడని గుర్తు చేసుకున్నారు. ‘తాతా! నువ్వు విజయ్‌కే ఓటు వేయాలి’ అంటూ తన మనవడు పట్టుబట్టాడని వివరించారు. ఇలా పిల్లల్ని వినియోగించుకోవడం తప్పు కదా అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా టీవీకే తరఫు న్యాయవాది మురళీధర్ వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నప్పుడు జరిగినట్లు ఆరోపించబడుతున్న ఉల్లంఘనలపై ఎన్నికలు ముగిసిన తరువాత కూడా జోక్యం చేసుకునే అధికారం ఈసీకి ఉందా లేదా అనే విషయాన్ని న్యాయస్థానం ప్రధానంగా పరిశీలించాల్సిన ఆసక్తికరమైన కేసు ఇది అని వివరించారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని అభ్యర్థించడంతో అందుకు ధర్మాసనం సమ్మతించింది.