Share News

క్రైస్తవం నుంచి తిరిగొస్తే మళ్లీ ఎస్సీ హోదా

ABN , Publish Date - Sep 20 , 2026 | 05:49 AM

క్రైస్తవ మతం నుంచి తిరిగి హిందూమతంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ సర్టిఫికెట్‌ పొందే హక్కు ఉందని మద్రాస్‌ హైకోర్టు స్పష్టం చేసింది.

క్రైస్తవం నుంచి తిరిగొస్తే మళ్లీ ఎస్సీ హోదా

  • పిటిషనర్‌కు ఆ సర్టిఫికెట్‌ పొందే హక్కు ఉందని స్పష్టం చేసిన మద్రాస్‌ హైకోర్టు

చెన్నై, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): క్రైస్తవ మతం నుంచి తిరిగి హిందూమతంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ సర్టిఫికెట్‌ పొందే హక్కు ఉందని మద్రాస్‌ హైకోర్టు స్పష్టం చేసింది. ఎస్సీగా ఆయన కుల ధ్రువీకరణపత్రం చెల్లదంటూ జిల్లా విజిలెన్స్‌ కమిటీ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. తిరువణ్ణామలెకి చెందిన రవికుమార్‌ ఎస్సీ రిజర్వేషన్‌ ఆధారంగా కస్టమ్స్‌ శాఖలో ఉద్యోగం పొంది అసిస్టెంట్‌ కమిషనర్‌గా పని చేశారు. ఈ ఏడాది మేలో ఆయన రిటైర్మెంట్‌ సమయంలో కులధ్రువీకరణ పత్రంపై విచారణ జరిగింది. రవికుమార్‌, అతని కుటుంబ సభ్యులు మంచి ఛాయ, పొడవు, దృఢమైన శరీరం కలిగి ఉన్నారని, తమిళం, ఇంగ్లీషు మాట్లాడుతున్నారని చెప్పి జిల్లా విజిలెన్స్‌ కమిటీ ఆయనను క్రైస్తవుడిగా ప్రకటించింది. ఆయన ఎస్సీ సర్టిఫికెట్‌ చెల్లదని ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని రవికుమార్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. విచారణ జరిపిన ధర్మాసనం.. పిటిషనర్‌ హిందూ దేవుళ్లను పూజిస్త్తున్నాడా? లేదా? హిందూ సమాజం ఆయనను అంగీకరించిందా? లేదా? అనే విషయాలపై విజిలెన్స్‌ కమిటీ విచారణ జరిపి ఉంటే సరైన నిర్ణయం వెలువడేదని పేర్కొంది. అలాకాకుండా.. మంచి ఛాయ, పొడవు, ఉంగరాల జుట్టు, మంచి శరీరాకృతి, అనర్గళంగా తమిళం, ఇంగ్లీషు మాట్లాడటాన్ని బట్టి క్రైస్తవుడిగా నిర్ధారించడం తగదని స్పష్టం చేసింది. పిటిషన్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. రవికుమార్‌ తండ్రి హిందూ ఆది ద్రావిడర్‌ కులానికి చెందినవారు. ఆయన 1960లో క్రైస్తవ మతంలోకి మారారు. 1966లో రవికుమార్‌ జన్మించగా, 1983లో చెన్నైలోని ఆర్యసమాజ్‌ కేంద్రంలో రవికుమార్‌, ఆయన తండ్రి.. ఇద్దరూ హిందూ మంతంలోకి మారారు. హిందూ ఆచారాలనే పాటిస్తున్నారు.

Updated Date - Sep 20 , 2026 | 05:50 AM