Share News

న్యాయమూర్తులు లక్ష్యంగా నిర్వహించే బహిరంగ సభలకు అనుమతి వద్దు

ABN , Publish Date - Oct 31 , 2026 | 02:51 AM

పదవిలో ఉన్న న్యాయమూర్తులను వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకుని, వారిని కించపరిచే, లేదా భయభ్రాంతులకు గురిచేసే ఉద్దేశంతో నిర్వహించే ఎలాంటి బహిరంగ సభలు, సమావేశాలు, ప్రదర్శనలకు అనుమతి ఇవ్వరాదని..

న్యాయమూర్తులు లక్ష్యంగా నిర్వహించే బహిరంగ సభలకు అనుమతి వద్దు

  • ఆన్‌లైన్‌లో విమర్శలపై తక్షణం చర్యలు: మద్రాస్‌ హైకోర్టు

చెన్నై, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): పదవిలో ఉన్న న్యాయమూర్తులను వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకుని, వారిని కించపరిచే, లేదా భయభ్రాంతులకు గురిచేసే ఉద్దేశంతో నిర్వహించే ఎలాంటి బహిరంగ సభలు, సమావేశాలు, ప్రదర్శనలకు అనుమతి ఇవ్వరాదని మద్రాస్‌ హైకోర్టు తమిళనాడు పోలీస్ శాఖను ఆదేశించింది. ఒకవేళ ఇతర కారణాలతో అనుమతి పొందిన సమావేశం.. న్యాయమూర్తులపై వ్యక్తిగత విమర్శలకు దిగితే సంబంధిత అధికారులు వెంటనే ఆ కార్యక్రమాన్ని నిలిపివేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. పదవిలో ఉన్న న్యాయమూర్తులను ఆన్‌లైన్‌ కంటెంట్‌ ద్వారా భయభ్రాంతులకు గురిచేసే నేరపూరిత చర్యలు జరుగకుండా చూడాలని, అలాంటి ఉల్లంఘనలు జరిగినపక్షంలో సైబర్‌క్రైం విభాగం చట్టప్రకారం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మన న్యాయసంస్థల భద్రతకు, సమగ్రతకు ముప్పు కలిగించేలా బహిరంగ ప్రదేశాలు, లేదా డిజిటల్‌ నెట్‌వర్క్‌లను ఎవరూ ఉపయోగించకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని స్పష్టం చేసింది. మత మార్పిడి జరిగినంత మాత్రాన ఒక వ్యక్తి వెనుకబడిన తరగతికి చెందిన ప్రయోజనాలను పొందలేరంటూ హైకోర్టు మదురై ధర్మాసనం గత జూన్‌లో ఇచ్చిన తీర్పును ఉద్దేశించి కొంతమంది వ్యక్తులు, కొన్ని సంస్థలు న్యాయమూర్తులపై వ్యక్తిగత విమర్శలు, దూషణలకు దిగారని, అలాంటి వారిపై చర్యలు చేపట్టాలంటూ చెన్నైకి చెందిన కార్తికేయన్‌ అనే వ్యక్తి ఇటీవల దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ ధర్మాధికారి, న్యాయమూర్తి జస్టిస్‌ జి.అరుళ్‌ మురుగన్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. నిజమైన న్యాయ స్వతంత్రత అంటే న్యాయమూర్తులు తమ ముందున్న చట్టం, వాస్తవాల ఆధారంగా మాత్రమే కేసులపై నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను కలిగి ఉండాలని అభిప్రాయపడింది.

Updated Date - Oct 31 , 2026 | 02:52 AM