Share News

Tirupparankundram Hill Temple: ఆ స్తంభంపై దీపం వెలిగించొచ్చు!

ABN , Publish Date - Jan 07 , 2026 | 02:26 AM

తమిళనాడులోని మదురై జిల్లా తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే విషయంలో మద్రాస్‌ హైకోర్టు మదురై బెంచ్‌ మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. కొండపై ఉండే స్తంభంపై దీపం వెలిగించొచ్చని సింగిల్‌...

Tirupparankundram Hill Temple: ఆ స్తంభంపై దీపం వెలిగించొచ్చు!

  • ‘తిరుప్పరంకుండ్రం’ కేసులో మద్రాస్‌ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం కీలక తీర్పు

చెన్నై, జనవరి 6(ఆంధ్రజ్యోతి)/న్యూఢిల్లీ: తమిళనాడులోని మదురై జిల్లా తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే విషయంలో మద్రాస్‌ హైకోర్టు మదురై బెంచ్‌ మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. కొండపై ఉండే స్తంభంపై దీపం వెలిగించొచ్చని సింగిల్‌ జడ్డి ఇచ్చిన ఉత్తర్వులను జస్టిస్‌ జీ జయచంద్రన్‌, జస్టిస్‌ కేకే రామకృష్ణన్‌ల ధర్మాసనం సమర్థించింది. దేవస్థాన ప్రతినిధులు మాత్రమే కార్తీక మాసంలో అక్కడ దీపం వెలిగించాలని స్పష్టం చేసింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ పర్యవేక్షించాలని ఆదేశించింది. కొండపైనున్న దీపస్తంభంపై కార్తీక దీపం వెలిగించేందుకు ఉత్తర్వులివ్వాలని కోరుతూ రవికుమార్‌ అనే హిందూమున్నని కార్యకర్త పిటిషన్‌పై జస్టిస్‌ స్వామినాధన్‌ ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలును ధర్మాసనం తోసిపుచ్చింది. తిరుప్పరంకుండ్రం కొండపై స్తంభం ఉన్న ప్రాంతం సుబ్రమణ్యస్వామి ఆలయానికి చెందినదేనని స్పష్టం చేసింది. అక్కడ దీపం వెలిగించడం ఆగమ శాస్త్రాల ప్రకారం నిషేధమనే వాదనకు అప్పీల్‌దారులు బలమైన ఆధారాలు సమర్పించలేకపోయారని పేర్కొంది. ఈ సందర్భంగా డీఎంకే ప్రభుత్వ తీరును న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. రాతి స్తంభం ఆ కొండపైనున్న దర్గాకు చెందిందన్న ప్రభుత్వ వాదన సరికాదని, ఆ స్తంభంపై దీపం వెలిగించడం వలన ప్రజాశాంతికి భంగం కలుగుతుందనే వాదన ‘హాస్యాస్పదం’ అని పేర్కొంది. కొండపై దీపం వెలిగించడం అక్కడి ఆచారం కాదని ప్రభుత్వం కానీ, ఆలయ యాజమాన్యం గానీ చెప్పడం లేదని తెలిపింది. ‘సంవత్సరంలో ఒక్క నిర్దిష్ట రోజున ఆలయ ప్రతినిధులను దీపం వెలిగించడానికి అనుమతిస్తే.. శాంతి భద్రతలకు భంగం కలుగుతుందనే వాదన హాస్యాస్పదంగా ఉంది. అలాంటి అలజడికి ప్రభుత్వమే ప్రోత్సాహం అందిస్తే తప్ప అది జరగదు. తమ రాజకీయ అజెండా కోసం ఏ ప్రభుత్వమూ ఆ స్థాయికి దిగజారకూడదని ఆశిస్తున్నాం’ అని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

సుప్రీంకోర్టుకు తమిళనాడు ప్రభుత్వం!

రాష్ట్ర మంత్రి ఎస్‌.రఘుపతి విలేకరులతో మాట్లాడుతూ.. కోర్టు తీర్పును తప్పుబట్టారు. తీర్పును సుప్రీంకోర్టులో సవాల్‌ చేస్తామన్నారు. వందేళ్ల చరిత్రను పరిశీలిస్తే ఇప్పటివరకు లేని సంప్రదాయాన్ని బలవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. మరోవైపు, హైకోర్టు తీర్పును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్‌ నాగేంద్రన్‌, మాజీ అధ్యక్షుడు అన్నామలై స్వాగతించారు. తాజా తీర్పు డీఎంకే ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిందని పేర్కొన్నారు.

Updated Date - Jan 07 , 2026 | 02:26 AM