ఉదయనిధిది విద్వేష ప్రసంగమే
ABN , Publish Date - Jan 22 , 2026 | 03:36 AM
తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి సనాతన ధర్మానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై మద్రాస్ హైకోర్టు మదురై డివిజన్ బెంచ్ తీవ్రంగా స్పందించింది.
సనాతనపై ఆయన వ్యాఖ్యలు హిందువులకు వ్యతిరేకం: మద్రాస్ హైకోర్టు
చెన్నై, జనవరి 21(ఆంధ్రజ్యోతి): తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి సనాతన ధర్మానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై మద్రాస్ హైకోర్టు మదురై డివిజన్ బెంచ్ తీవ్రంగా స్పందించింది. ఆయన వ్యాఖ్యలు విద్వేషపూరితమైనవని, దేశంలో 80 శాతం మందిగా ఉన్న హిందువులకు వ్యతిరేకమైనవని బెంచ్ స్పష్టం చేసింది. ద్రవిడ ఉద్యమ నేత పెరియార్ మినహా మహాత్మాగాంధీ, కామరాజర్, బుద్ధుడు, రామానుజుడు, వళ్లలార్ వంటి మహాపురుషులు సనాతన ధర్మానికి వ్యతిరేకులు కారని వ్యాఖ్యానించింది. ఉదయనిధి స్టాలిన్ 2023లో సనాతన ధర్మానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన ఢిల్లీకి చెందిన బీఏపీ ఐటీ విభాగం జాతీయ అధ్యక్షుడు అమిత్ మాల్వియాపై తిరుచ్చి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసును రద్దు చేయాలని కోరుతూ అమిత్ మాల్వియా హైకోర్టు మదురై డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై విచారణ క్రమంలో ఉదయనిధి స్టాలిన్‌ను ఉద్దేశించి న్యాయమూర్తి జస్టిస్ ఎస్ శ్రీమతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి (ఉదయనిధి స్టాలిన్) బయట తిరుగుతున్నారు. ఆయనపై మిగతా రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయిగానీ, తమిళనాడులో కేసు పెట్టలేదు. కానీ, ఆ వ్యక్తి వ్యాఖ్యలను వ్యతిరేకించారంటూ, పిటిషనర్‌పై మాత్రం కేసు పెట్టారు. ఈ పరిస్థితి బాధిస్తోంది’’ అని న్యాయమూర్తి అన్నారు. పోలీసులు నమోదు చేసిన కేసును రద్దుచేశారు. ఈ క్రమంలో ఉదయనిధి ప్రసంగంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘‘నాశనం’ (తమిళంలో ఒళిప్పు) అనే పదం ప్రాతిపదికగా ఈ కేసు దాఖలైంది. నాశనం అంటే ఉన్నదానిని లేకుండా చేయడమే. సనాతన ధర్మాన్ని అనుసరించే వ్యక్తుల సమూహం ఉండకూడదనుకుంటే.. అది ‘జాతి నిర్మూలన’ కిందకు వస్తుంది. అందువల్ల ఉదయనిధి ప్రసంగాన్ని ఖండిస్తూ సోషల్ మీడియలో పోస్ట్ పెట్టినదానిని ద్వేషపూరిత ప్రసంగంగా పరిగణించలేం.’’ అని న్యాయమూర్తి తెలిపారు. తమిళనాట హిందువులపై గతంలో ఎన్నో దాడులు జరిగాయనేందుకు ఆధారాలు ఉన్నాయన్నారు. గత వందేళ్లుగా ఉన్న డీఎంకే ఆధ్వర్యంలో హిందూమతంపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. కాగా, తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఉదయనిధి స్టాలిన్ తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా డిమాండ్ చేశారు.
ఉదయనిధి స్టాలిన్ ఏమన్నారంటే..
ఉదయనిధి 2023లో జరిగిన ఓ సభలో మాట్లాడుతూ.. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ‘‘కొన్నింటిని మనం వ్యతిరేకించలేం. వాటిని నిర్మూలించాల్సిందే. డెంగీ, దోమలు, మలేరియా, కరోనాలను నిర్మూలించేస్తాం కదా! అదేవిధంగా సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడం కాకుండా.. దానిని నిర్మూలించేయాలి. సామాజిక న్యాయానికి, సమానతకు సనాతన ధర్మం వ్యతిరేకం. కులం, మతం ఆధారంగా అది సమాజాన్ని చీల్చివేస్తుంది’’ అని వ్యాఖ్యానించారు.