Share News

ముగ్గురు ఐఏఎస్‌లను పెళ్లాడిన ఐఏఎస్‌ ఆఫీసర్‌

ABN , Publish Date - Feb 19 , 2026 | 03:58 AM

అబ్బాయిలకు పెళ్లి కావడం కష్టంగా మారిన ఈ రోజుల్లో మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ ఐఏఎస్‌ అధికారి మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. అంతేనా..

ముగ్గురు ఐఏఎస్‌లను పెళ్లాడిన ఐఏఎస్‌ ఆఫీసర్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: అబ్బాయిలకు పెళ్లి కావడం కష్టంగా మారిన ఈ రోజుల్లో మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ ఐఏఎస్‌ అధికారి మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. అంతేనా.. ఆయన పెళ్లాడిన ముగ్గురూ ఐఏఎస్‌ అధికారిణులే కావడం ఇక్కడ వింత. మొదటి, రెండో భార్యకు విడాకులిచ్చిన సదరు ఐఏఎస్‌ అధికారి మూడోసారి కూడా ఐఏఎస్‌ అధికారిణినే పెళ్లాడారు. ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌కు చెందిన అవీ ప్రసాద్‌ 2013లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. కానీ 2014లో మరోసారి సివిల్స్‌ పరీక్షలు రాసి ఐఏఎస్‌ అయ్యారు. రాజకీయ కుటుంబనేపథ్యం కలిగిన అవీ ప్రసాద్‌.. సివిల్స్‌ పరీక్షకు సిద్ధమవుతున్నప్పుడు పరిచయమైన రిజు బాఫ్నా అనే అమ్మాయిని మొదట పెళ్లి చేసుకున్నాడు. రిజు ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్‌ జిల్లా కలెక్టర్‌గా పని చేస్తుండగా.. అవీ ప్రసాద్‌, రిజు కొన్నేళ్లకు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఏపీకి చెందిన 2016 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారిణి మిషా సింగ్‌ను అవీ ప్రసాద్‌ పెళ్లాడారు. పెళ్లి తర్వాత మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు మారిన మిషా సింగ్‌ ప్రస్తుతం రత్లాం కలెక్టర్‌గా పని చేస్తున్నారు. నాలుగేళ్లు కలిసి ఉన్న తర్వాత అవీ ప్రసాద్‌, మిషా సింగ్‌ విడాకులు తీసుకున్నారు. ఇక, ముచ్చటగా మూడో సారి అన్నట్టు ఈసారి 2017 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారిణి అంకితా ధాకరేని అవీ ప్రసాద్‌ ఫిబ్రవరి 11న పెళ్లి చేసుకున్నారు. అవీ ప్రసాద్‌ ప్రస్తుతం మధ్యప్రదేశ్‌ ఉపాధి హామీ మండలి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌(సీఈవో)గా పని చేస్తున్నారు.

Updated Date - Feb 19 , 2026 | 03:58 AM