ఏ దేశమూ చేయలేనిదిభారత్ చేసి చూపింది
ABN , Publish Date - Feb 20 , 2026 | 02:35 AM
ప్రపంచంలో ఏ దేశమూ చేయలేని డిజిటల్ వ్యవస్థలను భారత్ అభివృద్ధి చేసిందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మెక్రాన్ ప్రశంసించారు.
140 కోట్ల మందికి డిజిటల్ గుర్తింపు.. విస్తృతమైన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ
ఏఐ ఇంపాక్ట్ సదస్సులో మెక్రాన్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: ప్రపంచంలో ఏ దేశమూ చేయలేని డిజిటల్ వ్యవస్థలను భారత్ అభివృద్ధి చేసిందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మెక్రాన్ ప్రశంసించారు. ప్రజలందరికీ డిజిటల్ విధానంలో ఆధార్, యూపీఐ, ఆరోగ్య కార్డులను అందుబాటులోకి తీసుకువచ్చిందని పేర్కొన్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సదస్సులో గురువారం మెక్రాన్ మాట్లాడారు. ‘నమస్తే’ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘‘ప్రపంచంలో ఏ దేశమూ చేయలేని దానిని భారత్ చేసి చూపింది. 140 కోట్ల మందికి డిజిటల్ గుర్తింపు, ప్రతినెలా 2 వేల కోట్ల లావాదేవీలు జరుగుతున్న డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ (యూపీఐ), 50 కోట్ల మందికి డిజిటల్ హెల్త్ ఐడీకార్డులు జారీ చేసిన వైద్యారోగ్య వ్యవస్థ.. ఇలా ఎన్నో. ఈ విజయాలు ప్రపంచానికి మార్గదర్శకం. భారత్ తన 140 కోట్ల మంది జనాభాను డిజిటల్ ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడం సాధ్యం కాదని పదేళ్ల క్రితం ప్రపంచం మొత్తం పేర్కొంది. కానీ ఆ అంచనా తప్పు అని భారత్ నిరూపించింది. పదేళ్ల క్రితం ముంబైలో ఒక వీధి వ్యాపారి బ్యాంకు ఖాతా తీసుకోలేకపోయారు. ఇప్పుడదే వీధి వ్యాపారి తన ఫోన్‌లో డిజిటల్ చెల్లింపులను పొందుతున్నారు. ఇది టెక్నాలజీ కథ కాదు. ఇదొక నాగరికత అభివృద్ధి కథ. ఇప్పుడు ఏఐ కేవలం పెద్ద దేశాలే ఆడగల ఆట అని కొందరు అంటున్నారు. కానీ భారత్, యూర్‌ప మా భాగస్వాములు, మా దృక్పథాన్ని నమ్మే ప్రభుత్వాలు, సంస్థలు, పెట్టుబడిదారులతో కలిసి అందుకు భిన్నంగా చేసి చూపిస్తాం’’ అని మెక్రాన్ పేర్కొన్నారు. ఆవిష్కరణలతోపాటు బాధ్యతను, సాంకేతికతను, మానవత్వాన్ని కలిపే ఏఐ భవిష్యత్తు నిర్మితమవుతుందని చెప్పారు. ఆ భవిష్యత్తును రూపొందించడంలో భారత్, ఫ్రాన్స్ కీలకపాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. భారత్ బలంగా ఉండటమే కాదు ఆఫ్రికా కూడా బలంగా ఉండాలని.. విభజనపై కాకుండా కలపడంపై, నాశనం చేయడంపై కాకుండా సృష్టించడంపై, కేవలం మాటలు కాకుండా పంచుకోవడంపై ప్రపంచ దేశాలు దృష్టిపెట్టాలని పి లుపునిచ్చారు. ఆ దిశగా జీ7 గ్రూపు అధ్యక్ష స్థానంలోని ఫ్రాన్స్, బ్రిక్స్ అధ్యక్ష స్థానంలో ఉన్న భారత్ ముందుకు సాగుతాయని ఆయన చెప్పారు.
ప్రధాని మోదీ-మెక్రాన్ భేటీ..
సదస్సు సందర్భంగా ప్రధాని మోదీతో మెక్రాన్ భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. ఈ భేటీకి ముందు మెక్రాన్, మోదీ చేతులు కలిపి ప్రేమ చిహ్నం చూపుతున్నట్టుగా ఏఐతో రూపొందించిన చిత్రాన్ని మెక్రాన్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘స్నేహితులు ఎప్పుడు కలుస్తారో.. అప్పుడు సృజనాత్మకత వారిని అనుసరిస్తుంది. ఏఐ సదస్సు కోసం సిద్ధం’ అంటూ క్యాప్షన్ పెట్టారు.
రఫేల్ డీల్‌తో భారత్ రక్షణ బలోపేతం
రఫేల్ యుద్ధ విమానాలు భారత్‌ను రక్షణపరంగా బలోపేతం చేస్తాయని, అలాంటి ఒప్పందాన్ని ఎందుకు విమర్శిస్తున్నారో తెలియదని మెక్రాన్ వ్యాఖ్యానించారు. రూ.3.25 లక్షల కోట్ల విలువైన 114 రఫేల్ ఫైటర్ల కొనుగోలుకు భారత్ సిద్ధమైన విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు కూడా వస్తున్నాయి. గురువారం ఢిల్లీలో ఏఐ సదస్సు సందర్భంగా ఈ అంశంపై మెక్రాన్‌ను మీడియా ప్రశ్నించగా.. ‘‘రఫేల్ ఫైటర్లను తయారు చేసే దసో ఏవియేషన్‌కు, మీ ప్రభుత్వానికి మధ్య ఒప్పందం అది. ఇది మీ దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తుంది. భారత్‌లో ఉద్యోగాలను కూడా కల్పిస్తుంది. అలాంటి ఒప్పందాన్ని ఎందుకు విమర్శిస్తున్నారో అర్థం కావడం లేదు’’ అని పే ర్కొన్నారు. రక్షణ ఉత్పత్తుల్లో వీలైనన్ని భారత విడిభాగాలను వినియోగించేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.