Share News

కోచింగ్‌ సెంటర్‌లో అగ్ని ప్రమాదం..15మంది ఆహుతి

ABN , Publish Date - Jun 23 , 2026 | 02:26 AM

చుట్టూ ఎగిసిపడుతున్న మంటలు.. దట్టంగా కమ్ముకున్న పొగ.. ఎటూ పారిపోలేని పరిస్థితుల్లో ప్రాణ భయంతో పిల్లల హాహాకారాలు.. బాత్రూంలో దాక్కొంటే ప్రాణాలు దక్కుతాయేమోనని ఒకరు..

కోచింగ్‌ సెంటర్‌లో అగ్ని ప్రమాదం..15మంది ఆహుతి

  • మృతుల్లో 13మంది యానిమేషన్‌ చదివే విద్యార్థులే

  • ప్రమాద సమయంలో కోచింగ్‌ సెంటర్‌లో 30మంది!

  • తమను కాపాడాలని ఇళ్లకు ఫోన్‌ చేసి వేడుకోలు

  • 13 మంది విద్యార్థులను కాపాడామన్న అధికారులు

  • ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూలో ఘటన

  • రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన మోదీ

లఖ్‌నవూ, జూన్‌ 22: చుట్టూ ఎగిసిపడుతున్న మంటలు.. దట్టంగా కమ్ముకున్న పొగ.. ఎటూ పారిపోలేని పరిస్థితుల్లో ప్రాణ భయంతో పిల్లల హాహాకారాలు.. బాత్రూంలో దాక్కొంటే ప్రాణాలు దక్కుతాయేమోనని ఒకరు.. డ్రైనేజీ పైపులను పట్టుకొని కిందికి జారితే బతుకుతామేమో అని ఇంకొకరు.. మంటల్లో కాలిపోతామన్న భయంలో కిందికి దూకేసినవాళ్లొకరు.. అంతా భీతావహం. ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూలో సోమవారం సంభవించిన ఘోర అగ్ని ప్రమాదం 13 మంది విద్యార్థులు సహా మొత్తం 15మందిని బలిగొంది. అలీగంజ్‌ ప్రాంతంలో ఉన్న ఓ మూడంతస్తుల భవనంలో మధ్యాహ్నం 3గంటల సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మూడంతస్తుల భవనం పూర్తిగా కాలిపోయి మసిబొగ్గులా మారింది. ఈ భవనం పైన అంతస్తులో యానిమేషన్‌ కోచింగ్‌ సెంటర్‌ ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో ఈ సెంటర్‌లో దాదాపు 30మంది దాకా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 13మంది విద్యార్థులు సజీవ దహనమయ్యారు. ఐదుగురికి గాయాలయ్యాయి. మరో, 13మంది విద్యార్థులను కాపాడినట్లు అధికారులు తెలిపారు. యానిమేషన్‌ కోచింగ్‌ సెంటర్లో ఉన్న పిల్లలు టాయిలెట్‌లో దాక్కొని తమ ప్రాణాలను కాపాడుకోవాలని ప్రయత్నించారు. కొంతమంది డ్రైనేజీ పైపులను పట్టుకొని దిగడానికి ప్రయత్నం చేశారు. తమ తల్లిదండ్రులకు ఫోన్లు చేసి తమను ఎలాగైనా కాపాడాలని గుండలవిసేలా రోదించారు. కింది అతస్తుల్లో ఉన్నవారిలో కొందరు ప్రాణాలను కాపాడుకోవడం భవనం నుంచి దూకిన వీడియోలు వైరల్‌ అయ్యాయి. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న జంతువుల దుకాణంలో ఉన్న పలు జంతువులు, పక్షులు మంటల్లో కాలిపోయాయి. 14అగ్నిమాపక యంత్రాలు వచ్చి మంటలను ఆర్పివేశాయి. అయితే, అప్పటికే భవనం అంతా కాలిపోయింది. అగ్నిమాపక యంత్రాలు ఆలస్యంగా వచ్చాయని స్థానికులు ఆరోపించారు. అధికారులు వచ్చేలోపే తాము వేగంగా స్పందించి కొంతమందిని కాపాడినట్లు చెప్పారు. అగ్ని ప్రమాదానికి కారణం ఏంటనే దానిపై స్పష్టత లేదు. దీనిపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు యూపీ డిప్యూటీ సీఎం బ్రజేశ్‌ పాఠక్‌ చెప్పారు. అగ్ని ప్రమాదంపై ప్రధాని మోదీ స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడినవారికి రూ.50వేలు ఇస్తామన్నారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తన అలీగఢ్‌ పర్యటనను రద్దు చేసుకుని లఖ్‌నవూ చేరుకున్నారు. రాహుల్‌ గాంధీ తదితర నేతలు కూడా ఈ ప్రమాదంపై స్పందించారు. మృతుల కుటుంబాల పట్ల సానుభూతి ప్రకటించారు.

Updated Date - Jun 23 , 2026 | 02:26 AM