Share News

విద్యార్థినిపై అత్యాచారం.. అట్టుడికిన పంజాబ్‌ వర్సిటీ

ABN , Publish Date - Sep 28 , 2026 | 05:38 AM

పంజాబ్‌లోని ఫగ్వారాలో ఉన్న లవ్‌లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ (ఎల్పీయూ) ప్రాంగణం విద్యార్థుల ఆందోళనలతో అట్టుడికింది.

విద్యార్థినిపై అత్యాచారం.. అట్టుడికిన పంజాబ్‌ వర్సిటీ

  • ఎల్పీయూలో నిరసనకు దిగిన 2 వేల మంది విద్యార్థులు

  • పలు ఆస్తులు, వాహనాల ధ్వంసం.. పరిస్థితి ఉద్రిక్తం

  • హైవే దిగ్బంధం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌.. గుర్తుతెలియని వ్యక్తిపై రేప్‌ కేసు నమోదు.. సిట్‌ వేసిన పోలీసు ఉన్నతాధికారులు

ఫగ్వారా, సెప్టెంబరు 27: పంజాబ్‌లోని ఫగ్వారాలో ఉన్న లవ్‌లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ (ఎల్పీయూ) ప్రాంగణం విద్యార్థుల ఆందోళనలతో అట్టుడికింది. వర్సిటీ హాస్టల్‌లో ఓ విద్యార్థినిపై బయటి వ్యక్తి అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ 2వేల మంది విద్యార్థులు ఆదివారం తెల్లవారుజామున క్యాంప్‌సలో బీభత్సం సృష్టించి.. పలు ఆస్తులను ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. అనంతరం ఢిల్లీ-అమృత్‌సర్‌ జాతీయ రహదారిని దిగ్బంధించడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో అక్కడి భారీగా చేరుకున్న పోలీసులు.. వారి ఫిర్యాదు మేరకు ‘గుర్తు తెలియని వ్యక్తి’పై రేప్‌ కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ జరిపేందుకు సిట్‌ను కూడా ఏర్పాటు చేశారు. మూడు రోజుల క్రితం వర్సిటీ హాస్టల్‌లో ఉంటున్న ఓ విద్యార్థినిపై ప్లంబర్‌ అత్యాచారం జరిపాడని ఆరోపిస్తూ విద్యార్థులు తెల్లవారుజామున 1 గంటలకు బాలికల హాస్టల్‌ ముందు ఆందోళన ప్రారంభించారు. వార్డెన్‌కు చెప్పినా పట్టించుకోలేదని వారు ఆరోపించారు. నినాదాలు చేస్తూ క్యాంపస్‌ పరిసరాల్లోని గదుల కిటికీలు, అక్కడి వస్తువులు, వాహనాలను ధ్వంసం చేశారు. విద్యార్థులు మధ్యాహ్నం వరకు హైవేపై బైఠాయించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.


డీఐజీ నవీన్‌ సింగ్లా మాట్లాడుతూ.. అత్యాచార ఘటన తర్వాత బాధితురాలు ఇంటికి వెళ్లిపోయిందని.. విద్యార్థుల వాంగ్మూలాల ఆధారంగా కేసు నమోదు చేసి సిట్‌ వేశామన్నారు. వర్సిటీలో 15రోజుల క్రితం తెలంగాణకు చెందిన ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని.. ఇందులో ఏదైనా కుట్ర ఉందని విద్యార్థులు చెబితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆ విద్యార్థిని మొబైల్‌ ఫోన్‌ను ఇప్పటికే ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించామన్నారు. కాగా.. క్యాంప్‌సలో ఎటువంటి అఘాయిత్యం జరగలేదని.. సోషల్‌ మీడియాలో వస్తున్న వదంతుల్లో ఎటువంటి నిజం లేదని ఎల్పీయూ ఓ ప్రకటనలో పేర్కొంది.

Updated Date - Sep 28 , 2026 | 05:39 AM