మళ్లీ బొగ్గులు, కిరోసిన్!
ABN , Publish Date - Mar 14 , 2026 | 04:26 AM
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా తలెత్తిన గ్యాస్ సంక్షోభం నుంచి బయట పడేందుకు మళ్లీ పాతపద్ధతులను అనుసరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. గతంలో బొగ్గులు, కిరోసిన్ స్టౌలపై వంటలు చేసుకునే విధానం తిరిగి .....
పాత విధానంలోకి వంటిళ్లు
ఎల్‌పీజీ సరఫరాలో ఇబ్బందులతో బొగ్గు, కిరోసిన్ సరఫరాకు కేంద్రం ఆదేశం
రేషన్ షాపుల్లో కిరోసిన్ విక్రయం
న్యూఢిల్లీ, మార్చి 13: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా తలెత్తిన గ్యాస్ సంక్షోభం నుంచి బయట పడేందుకు మళ్లీ పాతపద్ధతులను అనుసరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. గతంలో బొగ్గులు, కిరోసిన్ స్టౌలపై వంటలు చేసుకునే విధానం తిరిగి వచ్చింది. ప్రస్తుతం నెలకొన్న గ్యాస్ కొరత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వమే స్వయంగా బొగ్గులు, కిరోసిన్ వంటి సంప్రదాయ ఇంధన వనరులు వినియోగించుకోవాలని సూచించింది. ఇంట్లో వంటలైనా, హోటళ్లలో చేసే భారీ వంటకాలకైనా బొగ్గు, కిరోసిన్‌ను వాడుకోవచ్చని తెలిపింది. తాత్కాలిక ప్రాతిపదికన దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకూ కేటాయింపులు కూడా పెంచనున్నట్టు తెలిపింది. రాష్ట్రాలకు ప్రస్తుతం కేటాయిస్తున్న లక్ష కిలో లీటర్ల కిరోసిన్‌కు తాజాగా 48వేల కిలో లీటర్ల కిరోసిన్‌ను కేంద్ర ప్రభుత్వం అదనంగా కేటాయించింది. అదేవిధంగా వాణిజ్య, ఆతిథ్య రంగాల్లోని హోటళ్లలో వంటలు చేసేందుకు బయోమాస్, పిడకలు, ఆర్‌డీఎఫ్ పెల్లెట్స్, బొగ్గు వంటివాటిని వినియోగించుకునేందుకు అనుమతి ఇచ్చింది. నెలరోజుల పాటు ఈ వెసులుబాటు ఉంటుంది. మరోవైపు గృహ వినియోగ ఎల్‌పీజీ ఉత్పత్తిని 28ు మేర పెంచినట్టు చమురు మంత్రిత్వశాఖ అధికారి పేర్కొన్నారు.
గ్రామాల్లో 45 రోజుల నిరీక్షణ!
గ్రామీణ ప్రాంతాల్లో గృహ వినియోగ సిలిండర్ బుకింగ్‌కు 45 రోజుల సమయాన్ని పెంచినట్టు కేంద్రం తెలిపింది. దీని ప్రకారం ఒక కుటుంబం ఒక సిలిండర్ పొందిన తర్వాత.. మరో సిలిండర్ బుక్ చేసుకునేందుకు 45 రోజులపాటు నిరీక్షించాల్సి ఉంటుంది. ఇక, పట్టణ ప్రాంతాల్లో ఈ నిరీక్షణ సమయాన్ని 21 రోజులుగా గతవారమే నిర్ణయించింది. ఇదిలావుంటే, పౌరసరఫరాల శాఖ పరిధిలోని రేషన్ దుకాణాల ద్వారా కిరోసిన్ పంపిణీ చేయనున్నట్టు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి గురువారం పార్లమెంటులో ప్రకటించారు.
ఇడ్లీ, వడతోపాటు.. గ్యాస్‌కూ బిల్లు!
ముడిపదార్థాలు, తయారీకి అయ్యే ఖర్చు, లాభం.. ఇలా అన్నీ కలుపుకొన్నాకే హోటల్‌లో ఆహారపదార్థాలకు రేటు నిర్ణయిస్తారు! కానీ, పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో వాణిజ్య గ్యాస్‌కు కొరత ఏర్పడిన నేపథ్యంలో చెన్నైలో పలు హోటళ్లు.. ఇడ్లీ, వడ వంటి పదార్థాలతోపాటు, వాటి తయారీకి అయిన గ్యాస్ ఖర్చునూ రూ. బిల్లులో అదనంగా వడ్డిస్తున్నాయి! వినియోగదారుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి!! శశికుమార్ అనే ఒక లింక్డిన్ యూజర్.. చెన్నైలో అలా గ్యాస్‌కు అదనంగా చార్జీ వేసిన గీరాస్ రెస్టారెంట్ బిల్లును సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ బిల్లు ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ‘‘వాణిజ్య గ్యాస్ కొరత నేపథ్యంలో చెన్నైలోని హోటళ్లు ప్రతి బిల్లులోనూ ఎల్పీజీ సర్‌చార్జ్ కింద అదనంగా రూ.15 నుంచి రూ.20 దాకా వేస్తున్నాయి. 10 వేలకు పైగా హోటళ్లు మూతపడే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. చాలా హోటళ్లు మెనూల్లో కోత పెడుతున్నాయి. కొన్ని హోటళ్లు గ్యాస్ పొయ్యిలకు బదులు.. ఇండక్షన్ స్టవ్‌లు, కట్టెల పొయ్యిలవైపు మళ్లుతున్నాయి’’ అని ఆయన పేర్కొన్నారు. ఇక, భోపాల్‌లో పలు హోటళ్లు ఇండక్షన్ స్టవ్‌లను వినియోగించడం మొదలుపెట్టాయి. దేశవ్యాప్తంగా పలు హాస్టళ్లు, మెస్‌లపై గ్యాస్ కొరత ప్రభావం పడింది. చాలా హాస్టళ్లు, మెస్‌లలో భోజనాల తయారీని నిలిపివేసి.. సలాడ్‌లు, శాండ్‌విచ్‌లకు పరిమితం చేస్తున్నారు.
