రాజ్యసభలో ఎల్‌పీజీ రగడ!
ABN , Publish Date - Mar 17 , 2026 | 03:41 AM
దేశంలో వంటగ్యా్‌స(ఎల్‌పీజీ) కొరత వ్యవహారం రాజ్యసభలో అధికార, విపక్షాల మధ్య మాటల మంటలు రేపింది. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోని కారణంగానే దేశంలో.....
మీరు గ్యాస్ కొరత సృష్టించారు.. కాదు, మీరే అరాచకం సృష్టిస్తున్నారు
ఖర్గే వర్సెస్ నడ్డా మాటల మంటలు
న్యూఢిల్లీ, మార్చి 16: దేశంలో వంటగ్యా్‌స(ఎల్‌పీజీ) కొరత వ్యవహారం రాజ్యసభలో అధికార, విపక్షాల మధ్య మాటల మంటలు రేపింది. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోని కారణంగానే దేశంలో గ్యాస్ కొరత ఏర్పడిందని రాజ్యసభలో విపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. దీనికి కేంద్రమే బాధ్యత వహించాలన్నారు. అయితే.. ఈ వ్యాఖ్యలను తప్పుబట్టిన కేంద్ర మంత్రి జేపీ నడ్డా.. రాజకీయ దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీనే దేశంలో అరాచకం సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ఎదురుదాడి చేశారు. సోమవారం జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తిన ఖర్గే.. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం, దాని ప్రభావం గురించి తెలిసి కూడా ఎల్‌పీజీ విషయంలో కేంద్రం ముందస్తు చర్యలు చేపట్టేలేదని విమర్శించారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులను ముందుగానే అంచనావేసి.. ప్రణాళిక ప్రకారం వ్యవహరించి ఉంటే వంటగ్యాస్ కొరత సమస్య వచ్చేది కాదన్నారు. ఈ ప్రభావం దేశంలోని అన్ని రంగాలపైనా పడిందన్నారు. చిరు వ్యాపారులు, చిన్నపాటి హోటళ్లు నిర్వహించుకునేవారు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సామూహిక వంటల నుంచి అయోధ్య ఆలయంలో భక్తులకు పెట్టే అన్న ప్రసాదాల(రామ్ రసోయి) వరకు అన్నీ మూతబడ్డాయన్నారు. సిలిండర్ల బుకింగ్‌కు నిరీక్షణ సమయాన్ని పెంచడం కూడా ప్యానిక్ బుకింగ్‌కు దారితీసిందని ఖర్గే అన్నారు. ఇది సంక్షోభాన్ని అంచనా వేయడంలోను, దాని నివారణకు ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టకపోవడాన్ని స్పష్టం చేస్తోందన్నారు. అంతేకాదు, లోపభూయిష్ట విదేశాంగ విధానాన్ని కూడా స్పష్టం చేసిందని దుయ్యబట్టారు.
సంక్షోభంలోనూ రాజకీయం: నడ్డా
ఖర్గే వ్యాఖ్యలను మంత్రి జేపీ నడ్డా తిప్పికొట్టారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకుందన్నారు. సంక్షోభ సమయంలోనూ రాజకీయాల కోసం ఆ పార్టీ నేతలు పాకులాడుతున్నారని దుయ్యబట్టారు. పశ్చిమాసియా సంక్షోభం భారత్ వల్ల రాలేదని, దీనిలో మన దేశపాత్ర కూడా ఏమీ లేదని చెప్పారు. ఎల్‌పీజీ సిలిండర్లను బ్లాక్ చేస్తూ ఓ కాంగ్రెస్ నేత కూడా పట్టుబడ్డారని తెలిపారు. ప్రస్తుత సమయంలో ప్రజలకు అండగా నిలవాల్సిన వారే.. రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో చమురు, వంటగ్యాస్ అంశాలపై పెట్రోలియం శాఖ మంత్రి హర్దీ్‌పసింగ్ పురి లోక్‌సభలో విపులంగా ప్రస్తావించారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు తెలిపారు. కానీ, మంత్రి ప్రస్తావనను కాంగ్రెస్ సభ్యులు వినిపించుకోలేదని విమర్శించారు.