మోదీ సర్కారుకు అగ్ని పరీక్ష
ABN , Publish Date - Apr 17 , 2026 | 03:17 AM
పుష్కరకాలంగా ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్రమోదీ.. పార్లమెంట్‌లో శుక్రవారం తొలిసారి అగ్నిపరీక్షను ఎదుర్కోబోతున్నారు. మోదీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న .....
మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై నేడే లోక్ సభలో ఓటింగ్..
40 మంది విపక్ష సభ్యులు గైర్హాజరైతే సరిపోతుందని బీజేపీ భావన
సమాజ్‌వాదీ నేత అఖిలేశ్‌తో మంతనాలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): పుష్కరకాలంగా ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్రమోదీ.. పార్లమెంట్‌లో శుక్రవారం తొలిసారి అగ్నిపరీక్షను ఎదుర్కోబోతున్నారు. మోదీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు పై శుక్రవారం సాయంత్రం 4 గంటలకు లోక్‌సభలో ఓటింగ్ జరుగుతుండగా, శనివారం రాజ్యసభలో ఈ బిల్లులు చర్చకు రానున్నాయి. గురువారం లోక్‌సభలో జరిగిన చర్చలో విపక్షాలన్నీ ఈ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకించాయి. మహిళా రిజర్వేషన్ అంశాన్ని డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం సరైంది కాదని.. కాంగ్రెస్ నేతలు ప్రియాంకాగాంధీ, కేసీ వేణుగోపాల్, గౌరవ్ గొగోయ్, సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేశ్ యాదవ్, డీఎంకే నేత రాజా, శివసేన (యూబీటీ) ఎంపీ అరవింద్ సావంత్ తదితరులు స్పష్టం చేశారు. లోక్‌సభలో మోదీ సర్కారుకు ఓటమి తప్పదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ అన్నారు. గురువారం ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఫ్లోర్ లీడర్లు సమావేశమై.. బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు సంఘటితంగా పనిచేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలను ఏ విధంగా తమ వైపునకు తిప్పుకోవాలా అనే అంశంపై అధికార పక్షం దృష్టి సారించినట్టు సమాచారం. మరోవైపు.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన ఛాంబర్ లో కేంద్రహోంమంత్రి తో పాటు పలువురు మంత్రులతో భేటీ అయి ఏ విధంగానైనా ఈ బిల్లులను ఆమోదం పొందేలా చూడాలని తెలిపారు. కనీసం 40 మంది విపక్ష సభ్యులు గైర్హాజరైతే ఏ సమస్యా ఉండదని బీజేపీ నేతలు చెప్పగా.. విపక్షాలతో మాట్లాడాలని, ఒక్కొక్క ఎంపీతో చర్చించాలని మోదీ సూచించినట్లు తెలిసింది.
ఇదీ లెక్క..
లోక్‌సభలో ప్రస్తుతం 541 మంది సభ్యులున్నారు. అందులో మూడింట రెండోవంతు మంది.. అంటే 360 మంది మద్దతునిస్తేనే మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులు ఆమోదం పొందుతాయని అధికార వర్గాలు తెలిపాయి. ఎన్డీఏకి ప్రస్తుతం 294 మంది సభ్యుల మద్దతు ఉన్నదని, వైసీపీ, చిన్న పార్టీలు, స్వతంత్రులతో కలిసి ఈసంఖ్య 305కు చేరుకున్నట్టు ఆ వర్గాలు వెల్లడించాయి. అంటే బిల్లు ఆమోదం పొందడానికి మరో 55 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే ప్రతిపక్ష శిబిరంలో చీలికలు తప్పవని.. పలువురు తమకు అనుకూలంగా ఓటు వేయడమో, లేక గైర్హాజరు కావడమో చేస్తారని బీజేపీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు అఖిలేశ్ యాదవ్‌తో మంతనాలు జరుగుతున్నాయని, కాంగ్రెస్ మద్దతు పొందేందుకు కూడా తీవ్ర యత్నాలు జరుగుతున్నాయని అధికారపార్టీలోని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఇక, రాజ్యసభలో బిల్లులు ఆమోదం పొందేందుకు 163 మంది సభ్యుల మద్దతు అవసరం కాగా.. ఎన్డీఏకు 142 మంది మద్దతు ఉన్నదని, మరో 21 మంది మద్దతు సాధించవలిసి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. లోక్ సభలో బిల్లులు ఆమోదం పొందితే రాజ్యసభలో ఆమోదానికి ఎటువంటి సమస్యా ఉండదని ఈ వర్గాలు చెబుతున్నాయి.
అన్ని రాష్ట్రాలకూ 50 శాతం సీట్ల పెంపునకు నాదీ హామీ: అమిత్ షా
అన్ని రాష్ట్రాలకూ 50 శాతం సీట్లు పెంచుతామని బిల్లులో ఎక్కడున్నదని లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ ప్రశ్నించినప్పుడు.. తాను హోంమంత్రిగా ఆ హామీ ఇస్తున్నానని అమిత్ షా చెప్పడం గమనార్హం. కులగణన గురించి సమాజ్ వాది పార్టీ నేత అఖిలేశ్‌యాదవ్ ప్రశ్నించగా.. వచ్చే జనగణనలో చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. ప్రతిపక్షాలు ఆమోదం తెలుపుతామంటే.. ఈ బిల్లులకు కొన్ని సవరణలు ప్రతిపాదించేందుకు కూడా అనుమతించాలని బీజేపీ అగ్రనేతలు నిర్ణయించినట్లు సమాచారం.