స్పీకర్ తొలగింపుపై 9న చర్చ
ABN , Publish Date - Feb 16 , 2026 | 04:16 AM
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై మలివిడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే మార్చి 9న చర్చ జరుగుతుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు వెల్లడించారు.
అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో అదే రోజు ఓటింగ్.. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రిజిజు వెల్లడి
తవాంగ్, ఫిబ్రవరి15: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై మలివిడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే మార్చి 9న చర్చ జరుగుతుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు వెల్లడించారు. అదే రోజు సభలో ఓటింగ్ కూడా జరుగుతుందన్నారు. ఆదివారం ఆయన అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో ఓ వార్తాసంస్థతో మాట్లాడారు. రెండో విడత సమావేశాలు మొదలయ్యే తొలి రోజునే అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టాలనేది సభా నిబంధనగా రిజిజు పేర్కొన్నారు. వచ్చే నెల 9 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగే మలివిడత సమావేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని.. ముఖ్యమైన బిల్లులతో పాటు ఓ కీలక బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్నామని తెలిపారు.ఆ బిల్లేమిటో ఇప్పుడే బహిర్గతం చేయబోమన్నారు. తొలి విడతలో మాదిరిగానే ఈసారి కూడా సభా కార్యకలాపాలను విపక్షాలు అడ్డుకుంటే.. అది వాటికే నష్టం చేస్తుందని హెచ్చరించారు. లోక్‌సభలో ఐదు శాఖలు, రాజ్యసభలో మరో ఐదు శాఖల బడ్జెట్‌కు సంబంధించిన డిమాండ్లపై చర్చ జరుగుతుందన్నారు. సభలు నడవడానికి విపక్షాలు సహకరించకపోతే గిలెటిన్ చేసుకుపోతామని హెచ్చరించారు. పశ్చిమబెంగాల్, తమిళనాడు, అసోం, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీకి ఏప్రిల్లో ఎన్నికలు జరగనున్నాయని గుర్తుచేశారు. కీలకమైన బిల్లు సహా ముఖ్యమైన బిల్లులు తెచ్చి వాటన్నిటినీ ఆమోదింపజేసుకుంటామని తెలిపారు. జమిలి ఎన్నికల బిల్లేనా అడుగగా.. ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. పార్లమెంటరీ కమిటీ తన నివేదికకు ఇంకా తుది రూపం ఇవ్వలేదని చెప్పారు. చర్చలో పాల్గొనకుంటే విపక్షాలకే నష్టమని పునరుద్ఘాటించారు. వాటి మధ్య ఐక్యత లేదన్నారు. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానంపై టీఎంసీ సంతకం చేయలేదని గుర్తుచేశారు.
తారిఖ్ రహ్మాన్ ప్రమాణ స్వీకారానికి ఓం బిర్లా
బంగ్లాదేశ్ ప్రధానిగా ఫిబ్రవరి 17న ప్రమాణస్వీకారం చేయనున్న తారిఖ్ రహ్మాన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాజరుకానున్నారు. ఢాకాలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీని బంగ్లాదేశ్ ఆహ్వానించింది. అయితే స్పీకర్ ఓం బిర్లా భారత ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారని విదేశీ వ్యవహారాల శాఖ ఆదివారం తెలిపింది.