రూల్స్ ప్రకారమే లోక్‌సభ నిర్వహణ
ABN , Publish Date - Mar 13 , 2026 | 04:16 AM
లోక్‌సభ నిర్వహణ కేవలం నిబంధనల ఆధారంగానే జరుగుతుందని స్పీకర్ ఓం బిర్లా స్పష్టం చేశారు. వాటిని అతిక్రమించి మాట్లాడే విశేష అధికారం ఏ సభ్యుడికీ ఉండదని తేల్చి చెప్పారు.
వాటిని దాటి మాట్లాడే ప్రత్యేక అధికారం ఎవరికీ లేదు
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడి
న్యూఢిల్లీ, మార్చి 12: లోక్‌సభ నిర్వహణ కేవలం నిబంధనల ఆధారంగానే జరుగుతుందని స్పీకర్ ఓం బిర్లా స్పష్టం చేశారు. వాటిని అతిక్రమించి మాట్లాడే విశేష అధికారం ఏ సభ్యుడికీ ఉండదని తేల్చి చెప్పారు. తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన అనంతరం ఆయన గురువారం తొలిసారిగా లోక్‌సభకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సభాపతి స్థానం ఏ ఒక్క వ్యక్తికో చెందినది కాదని అన్నారు. అది సభ గౌరవానికి సంబంధించినదని తెలిపారు. సభ నిర్వహణ విషయమై స్ప్టమైన నిబంధనలు, విధివిధానాలు ఉన్నాయని, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా వాటి ఆధారంగానే కార్యకలాపాలు జరుగుతాయని చెప్పారు. నిజాయితీగా, నిష్పక్షపాతంగా విధి నిర్వహణను కొనసాగిస్తానని స్పీకర్ ప్రకటించారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంఽఽధీకి తగినంత సమయం ఇవ్వలేదంటూ చర్చ సందర్భంగా కొందరు సభ్యులు చేసిన ఆరోపణలకు వివరణ ఇచ్చారు. ఏ విషయం అంటే ఆ విషయంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతామంటే అనుమతించబోమని అన్నారు.