Share News

పార్లమెంటరీ స్నేహ బృందాలకు ఆరుగురు తెలుగు ఎంపీల నేతృత్వం

ABN , Publish Date - Feb 27 , 2026 | 02:44 PM

విదేశీ పార్లమెంటరీ బృందాలతో స్నేహపూర్వక సంబంధాలను బలోపేతం చేసే దిశగా లోక్‌సభ ఏర్పాటు చేసిన పార్లమెంటరీ మిత్ర బృందాల్లో కొన్నింటికి నేతృత్వం వహించే అవకాశం తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆరుగురు ఎంపీలకు దక్కింది. మరికొందరు సభ్యులుగా ఎంపికయ్యారు.

పార్లమెంటరీ స్నేహ బృందాలకు ఆరుగురు తెలుగు ఎంపీల నేతృత్వం
Lok Sabha parliamentary friendship group

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: విదేశీ పార్లమెంటరీ బృందాలతో స్నేహపూర్వక సంబంధాలను బలోపేతం చేసే దిశగా లోక్‌సభ ఇటీవల పార్లమెంటరీ మిత్ర బృందాలను నియమించింది. వాటిల్లో కొన్నింటికి నేతృత్వం వహించే అవకాశం తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆరుగురు ఎంపీలకు దక్కగా మరికొంత మంది సభ్యులుగా నియమితులయ్యారు.

కీలకమైన గల్ఫ్ దేశాల విషయానికి వస్తే, కువైత్‌ మిత్ర బృందానికి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఒమాన్‌ మిత్ర బృందానికి అసదుద్దీన్ ఒవైసీలు నేతృత్వం వహిస్తారు. వీరితో పాటు ఇరు రాష్ట్రాలకు చెందిన మరికొందరు ఎంపీలు కూడా వివిధ దేశాల బృందాలలో సభ్యులుగా నియమితులయ్యారు. ఈ రకంగా సౌదీ అరేబియా బృందంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, బహ్రెయిన్‌కు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఖతర్‌కు అయోధ్య రామిరెడ్డి, ఇరాన్‌కు నిరంజన్ రెడ్డి నియమితులయ్యారు.

ఇతర దేశాల విషయానికి వస్తే, శ్రీలంకకు దగ్గుబాటి పురందేశ్వరీ, మాల్దీవులకు లావు కృష్ణదేవరాయలు, క్యుబాకు మాగుంట శ్రీనివాసులరెడ్డి, యుద్ధంలో నిమగ్నమైన ఉక్రెయిన్‌కు ధర్మపురి అర్వింద్‌లు బృంద నేతలుగా నియమితులయ్యారు.


ఇరు రాష్ట్రాలకు చెందిన మరికొందరు ఎంపీలు కూడా వివిధ దేశాల బృందాలలో సభ్యులుగా నియమితులయ్యారు. ఎంపీలు ఆర్.కృష్ణయ్య, బైరెడ్డి శబరి, కె.రఘురామ్ రెడ్డి, కె.ఆర్.సురేశ్ రెడ్డి, అప్పలనాయుడు, కృష్ణప్రసాద్, గొల్లబాబురావు, వద్దిరాజు రవిచంద్ర, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు కూడా సభ్యులుగా నియమితులయ్యారు.

లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లాపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులతో పార్లమెంటరీ మిత్ర బృందాలను స్పీకర్ నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

అంతర్జాతీయ విదేశాంగ నీతిలో భాగంగా అనేక దేశాలు ఈ రకమైన పార్లమెంటరీ మిత్ర బృందాలు లేదా మండళ్లను ఏర్పాటు చేస్తుంటాయి. కానీ అనూహ్యంగా ఒక్కసారిగా 64 దేశాలకు నియమించడం భారతదేశంలో ఇదే ప్రప్రథమం.


ఈ వార్తలూ చదవండి:

దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్.. నేటి నుంచి నామినేషన్లు

ఎన్ కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి

Updated Date - Feb 28 , 2026 | 10:44 AM