ఎనిమిది మంది లోక్‌సభ సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేత
ABN , Publish Date - Mar 18 , 2026 | 04:15 AM
తెలంగాణ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సహా ఎనిమిది మంది ప్రతిపక్ష ఎంపీలపై విధించిన సస్పెన్షన్ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఎత్తివేశారు..
జాబితాలో తెలంగాణ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
న్యూఢిల్లీ, మార్చి 17(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సహా ఎనిమిది మంది ప్రతిపక్ష ఎంపీలపై విధించిన సస్పెన్షన్ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఎత్తివేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా సభా కార్యాకలపాలకు ఆటంకం కలిగించారని, స్పీకర్ కుర్చీ వైపు కాగితాలు విసిరినందుకు 8మంది ఎంపీలను స్పీకర్ ఓం బిర్లా ఫిబ్రవరి 3న సస్పెండ్ చేశారు. ఈ బడ్జెట్ సమావేశాల మొత్తానికి సస్పెన్షన్ అమలులో ఉంటుందని చెప్పారు. సస్పెండైన వారిలో కాంగ్రెస్ ఎంపీలు గుర్జీత్‌సింగ్, హిబి ఈడెన్, చామల కిరణ్‌కుమారెడ్డి, అమరీందర్‌సింగ్, మాణిక్కం ఠాగూర్, ప్రశాంత్ పడోలే, డీన్ కురియాకోస్, ఎస్ వెంకటేశన్(సీపీఎం) ఉన్నారు. అయితే, సస్పెన్షన్ ఎత్తివేతపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలో మంగళవారం తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ధర్మేంద్రయాదవ్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(శరద్‌పవార్)కు చెందిన సుప్రియా సులే మద్దతు పలికారు. మౌఖిక ఓటు ద్వారా ఎంపీల సస్పెన్షన్ రద్దయింది. సస్పెన్షన్ రద్దయిన తర్వాత ఎంపీలు పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహనికి నివాళుర్పించారు. అనంతరం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ప్రజా సమస్యలపై చర్చకు స్పీకర్ అనుమతి ఇవ్వాలని అన్నారు. సభలోకి మరోసారి ప్లకార్డులు, తీసుకురావద్దని, వెల్‌లోకి రావద్దని స్పీకర్ సూచించారని తెలిపారు. సభకు అంతరాయం కలిగించాలనే ఉద్దేశం తమకు లేదని, స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అన్నారు.