Share News

అధికార సమతూకంపై ప్రభావం

ABN , Publish Date - Nov 30 , 2026 | 04:10 AM

కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న డీలిమిటేషన్‌ బిల్లు ఆమోదం పొందితే లోక్‌సభ ఎంపీల సంఖ్య ప్రస్తుతమున్న 543 నుంచి 824కు చేరే అవకాశముందని తెలుస్తోంది.

అధికార సమతూకంపై ప్రభావం

  • రాష్ట్రపతి ఎన్నికల్లో రాజ్యసభ ఓట్ల ప్రాధాన్యం తగ్గే అవకాశం

న్యూఢిల్లీ, నవంబరు 29: కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న డీలిమిటేషన్‌ బిల్లు ఆమోదం పొందితే లోక్‌సభ ఎంపీల సంఖ్య ప్రస్తుతమున్న 543 నుంచి 824కు చేరే అవకాశముందని తెలుస్తోంది. తాజా బిల్లులో రాజ్యసభ ఎంపీల సంఖ్యలో పెంపుదలపై సంకేతాల్లేవు. దీంతో 245 మంది సభ్యులుండే రాజ్యసభపై లోక్‌సభ పైచేయి సాధించనుంది. దీంతో రెండు సభల మధ్య అధికార సమతూకంపై ప్రభావం పడనుంది. దీనికి తోడు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాజ్యసభ ప్రాధాన్యం తగ్గే అవకాశం ఉంది. ఇలా ఉంటే కేంద్రంలో జంబో కేబినెట్‌ ఏర్పడనుంది. ఇప్పటికే ఎంపీల సంఖ్యాపరంగా రాజ్యసభపై లోక్‌సభ ఆధిక్యం ఉంది. ఎంపీల సంఖ్య 824కు చేరితే లోక్‌సభ ఆధిక్యం మరింత పెరగనుంది. తాజా బిల్లులో రాజ్యసభ ఎంపీల సంఖ్యను పెంచే ప్రతిపాదన ఏమీ లేదు. దీంతో సంయుక్త సమావేశాల్లో బిల్లుల ఆమోదంపై రాజ్యసభ ప్రభావం తగ్గనుంది. దీనికి తోడు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా రాజ్యసభ సభ్యుల ఓట్ల ప్రాధాన్యం తగ్గవచ్చని విశ్లేషకుల అంచనా. సమాఖ్య స్ఫూర్తి దెబ్బతినకుండా ఉండాలంటే లోక్‌సభతో పాటు రాజ్యసభ ఎంపీల సంఖ్యను కూడా పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. లోక్‌సభ ఎంపీల సంఖ్య 824కు పెంచితే ప్రస్తుత ఉభయ సభల సభ్యుల నిష్పత్తి (2.2:1)ప్రకారం రాజ్యసభ సభ్యుల సంఖ్య 372కు పెంచాలని సూచిస్తున్నారు. రాజ్యసభ సభ్యుల సంఖ్య పెంచకపోతే నిష్పత్తి 3.3:1కి చేరుతుంది. కొత్త పార్లమెంటు భవనంలో 384మంది రాజ్యసభ ఎంపీలకు ఇప్పటికే ముందస్తు ఏర్పాట్లు కూడా ఉండటంతో ప్రస్తుత నిష్పత్తి ప్రకారం రాజ్యసభలో అదనంగా 127 మందికి అవకాశం కల్పించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.

Updated Date - Nov 30 , 2026 | 04:11 AM