మాటలు తక్కువ.. పైసలెక్కువ!
ABN , Publish Date - Nov 30 , 2026 | 02:51 AM
నియోజకవర్గాల పునర్విభజనతో లోక్‌సభ స్థానాల సంఖ్య 50 శాతం (తాజా సమాచారం ప్రకారం 543 నుంచి 824కు) పెరుగుతుంది సరే.. ఈ పెంపు పర్యవసానాల మాటేమిటి? ఎన్నికల నిర్వహణ భారం, జీతాల వ్యయం రెండూ పెరుగుతాయి.
ఎంపీ సీట్ల పెంపుతో భారీగా పెరగనున్న జీతభత్యాలు, ఎన్నికల ఖర్చు
సభలో సభ్యులు మాట్లాడే సమయంపైనా ప్రభావం
ఏటా సగటున ఒక్కో ఎంపీకి సభలో మాట్లాడేందుకు దక్కుతున్న సమయం 35-45 నిమిషాలు మాత్రమే
సభ్యుల సంఖ్యను భారీగా పెంచుతున్నందున సభను ఏటా 100-120 రోజులు జరపాలంటున్న నిపుణులు
నియోజకవర్గాల పునర్విభజనతో లోక్‌సభ స్థానాల సంఖ్య 50 శాతం (తాజా సమాచారం ప్రకారం 543 నుంచి 824కు) పెరుగుతుంది సరే.. ఈ పెంపు పర్యవసానాల మాటేమిటి? ఎన్నికల నిర్వహణ భారం, జీతాల వ్యయం రెండూ పెరుగుతాయి. అంతేనా.. కొత్తగా పెరిగే స్థానాలకు ఎన్నికయ్యే సభ్యుల కోసం ఢిల్లీలో చేయాల్సిన వసతి ఏర్పాట్ల వ్యయం, వారి జీతభత్యాల వ్యయం, వారికి కల్పించే సౌకర్యాల ఖర్చు.. ఇలా అన్నీ కలిపితే ఖర్చు భారీగా రూ.వేల కోట్లలోనే పెరుగుతుంది. ఖర్చు సంగతి అలా ఉంచితే.. సభలో సభ్యులకు మాట్లాడే సమయం బాగా తగ్గిపోయే ఆస్కారం ఉంది. పార్లమెంటరీ పరిశోధన సంస్థ ‘పీఆర్‌ఎస్ లెజిస్లేటివ్ రిసెర్చ్’ అధ్యయనం ప్రకారం.. గత (17వ) లోక్‌సభలో ఒక్కో ఎంపీకీ ఏడాదికి సగటున 35 నుంచి 45 నిమిషాలు మాట్లాడే అవకాశం మాత్రమే వచ్చింది. ఇప్పుడు సభ్యుల సంఖ్య 824కి పెరిగితే.. ఆ సగటు 23 నుంచి 30 నిమిషాలకు తగ్గిపోతుందని అంచనా. చిన్న పార్టీల ఎంపీలకు, స్వతంత్ర సభ్యులకు అసలు మాట్లాడే సమయం దొరకడమే గగనం అవుతుంది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి సైతం తొలినాళ్లలో ఈ సమస్య ఎదుర్కొన్నారు. ఆయన ఎంపీ అయిన కొత్తల్లో సభలో మాట్లాడే అవకాశం వచ్చేది కాదనే విషయాన్ని ఒక సందర్భంలో చెబుతూ.. ‘కభీ కభీ బోల్‌నేకేలియే ముఝే వాకౌట్ కర్నా పడ్తాథా (మాట్లాడే అవకాశం కొన్ని సందర్భాల్లో వాకౌట్ కూడా చేయాల్సి వచ్చేది)’ అని ఆయన పేర్కొన్నారు. అప్పటికి ఇంకా సభలో 494 మంది సభ్యులే ఉండేవారు. ఇప్పుడా సంఖ్య 543 అయింది.
ఇప్పటికే చాలా మంది సభ్యులకు అసలు మాట్లాడే అవకాశమే రావట్లేదు. ఐదేళ్లలో ఒక్కసారి కూడా సభలో మాట్లాడని సభ్యులున్నారంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు సభ్యుల సంఖ్య ఇంకా పెరిగితే వారికి మాట్లాడేందుకు సమయం చాలా తక్కువగా దొరుకుతుంది. కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశిథరూర్ ఆదివారం ఈ అంశాన్ని ప్రస్తావించి.. ‘ఇప్పటికే సభలో కార్యకలాపాలు నిర్వహించడం కష్టంగా ఉంది. మంత్రులను ప్రశ్నలు అడగడానికి, నియోజకవర్గ సమస్యలను లేవనెత్తడానికి, జీరో అవర్‌లో మాట్లాడ్డానికే అవకాశం లభించట్లేదు’ అని గుర్తుచేశారు. సభ్యుల సంఖ్య పెరిగితే చాలా మంది చప్పట్లు కొట్టడానికే వస్తారంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ సమస్యను అధిగమించాలంటే.. పార్లమెంటు సమావేశాలను ఏడాదికి కనీసం 100-120 రోజులపాటు.. వీలైతే ఇంకా ఎక్కువ రోజులు జరపాలని రాజ్యాంగ నిపుణులు సూచిస్తున్నారు.
ఎంత భారమో..
తాజా ప్రతిపాదనల ప్రకారం లోక్‌సభ సభ్యుల సంఖ్య 543 నుంచి 824కు పెరిగితే.. కొత్తగా 281 మంది ఎంపీలు వచ్చినట్టు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై సంవత్సరానికి కనీసం రూ.1600 కోట్ల దాకా అదనపు భారం పడుతుందని అంచనా. అంటే ఐదేళ్ల కాలానికి దాదాపు 8000 కోట్లు. ఎన్నికల నిర్వహణ, ఢిల్లీలో వారికి వసతి భవనాల నిర్మాణ ఖర్చులు ఇందుకు అదనం. కొత్తగా ఎన్నికయ్యే 281మందికి జీతభత్యాలు, విమాన, రైలు ప్రయాణాలు, వైద్య ఖర్చులు ఏడాదికి రూ.135-145కోట్లు. ప్రతి ఎంపీకీ తన నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏడాదికి ఇచ్చే రూ.5 కోట్లు ఇందుకు అదనం. ఆ ఖర్చు ప్రస్తుతం ఏడాదికి రూ.2715 కోట్లుగా ఉంది. సభ్యుల సంఖ్య 824కు పెరిగితే.. రూ.4,120 కోట్లు అవుతుంది. అంటే.. ఏకంగా రూ.1,405 కోట్లు పెరిగినట్టు. దీనికి వారి జీతభత్యాల ఖర్చు రూ.135-145 కోట్లు కూడా కలుపుకొంటే దాదాపుగా 1600కోట్ల మేర అదనపు ఖర్చన్నమాట. ఇక వారికి ఢిల్లీలో ఉండడానికి అవసరమయ్యే నివాసాల నిర్మాణానికి రూ.వందల కోట్లు కావాలి. ఏటా వాటి నిర్వహణ, భద్రతకు మరికొన్ని రూ.వందల కోట్లు ఖర్చవుతాయని అంచనా. ఎన్నికల నిర్వహణ ఖర్చుల విషయానికి వస్తే.. కౌంటింగ్ కేంద్రాల సంఖ్య, ఈవీఎంల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఆ ఖర్చులతోపాటు.. ఎన్నికల సిబ్బంది, భద్రతా ఏర్పాట్లకు అయ్యే వ్యయం.. అంతా కలిపితే 15-20ు దాకా పెరిగే అవకాశం ఉందని అంచనా.
చివరాఖరు..
ఎంపీల సంఖ్యే కాదు.. డీలిమిటేషన్‌లో రాష్ట్రాల శాసనసభ నియోజకవర్గాల సంఖ్య కూడా పెరుగుతుంది కాబట్టి.. రాష్ట్ర ప్రభుత్వాలపైనా ఈ భారం భారీగా పెరగనుంది.
- సెంట్రల్ డెస్క్
123 మంది మంత్రులతో కేంద్ర క్యాబినెట్
2004 జనవరి నుంచి అమల్లోకి వచ్చిన రాజ్యాంగ నిబంధన ప్రకారం కేంద్ర మంత్రి మండలిలో ప్రధాని సహా కేంద్ర మం త్రుల సంఖ్య 15 శాతానికి మించకూడదు. ఆ లెక్కన గరిష్ఠంగా ఇప్పుడు 81 మందిని నియమించుకునే అవకాశముంది. కానీ, ప్రస్తు తం కేంద్ర క్యాబినెట్‌లో ప్రధానితో కలిపి 69 మంది ఉన్నారు. డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొంది ఎంపీల సంఖ్య 824కు చేరితే.. అందులో 15ు.. అంటే 123 మంది మంత్రులయ్యే అవకాశం ఉంది. అంటే.. ప్రస్తుత తెలంగాణ శాసనసభ సభ్యుల కన్నా కేంద్ర క్యాబినెట్‌లోని మంత్రుల సంఖ్యే ఎక్కువగా ఉంటుందన్నమాట!!
అదనపు ఎంపీలకు నివాసాలు.. అంత ఈజీ కాదు!
లోక్‌సభ ఎంపీల సంఖ్య 824కు చేరనుండటంతో 2029 ఎన్నికల తర్వాత అదనంగా వచ్చే ఎంపీలకు నివాస స్థలాలు అవసరమవుతాయి. కానీ ఢిల్లీలోని నార్త్ అవెన్యూ, సౌత్ అవెన్యూ ప్రాంతాల్లో ఎత్తైన భవనాలు నిర్మించేందుకు అవకాశం లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ సాయం తీసుకోవాల్సి ఉంటుంది. సెంట్రల్ ఢిల్లీలో ఇప్పటికే అనువైన స్థలాల కోసం కేంద్ర ప్రభుత్వం యత్నాలు ప్రారంభించిందని తెలుస్తోంది.
ఎంపీల జీతభత్యాలు ఎంతెంత?
కేంద్ర ప్రభుత్వం 2025 మార్చిలో సవరించిన నిబంధనల ప్రకారం ఎంపీలకు అందే జీతభత్యాలు, ఇతర సౌకర్యాలు..
జీతం 1,24,000
నియోజకవర్గ భత్యం 87,000
కార్యాలయ ఖర్చులు 75,000
రోజువారీ భత్యం 2,500
(*పార్లమెంటుకు హాజరైనప్పుడు)
విమాన ప్రయాణాలు
ఎంపీ, వారి జీవిత భాగస్వామి కోసం ఏడాదికి 34 ఉచిత సింగిల్ ఎయిర్ ట్రిప్పులు; ఎంపీ లేకున్నా వారి జీవితభాగస్వామి ఒంటరిగా ఈ కోటాలో ప్రయాణించవచ్చు
రైలు ప్రయాణాలు
దేశవ్యాప్తంగా ఎక్కడికైనా, ఎన్నిసార్లైనా ప్రయాణించడానికి ఎంపీకి, వారి జీవిత భాగస్వామికి ఫస్ట్‌క్లాస్ ఏసీ టికెట్
వసతి
ఐదేళ్ల పదవీకాలం ముగిసేవరకూ ఢిల్లీలో ఉచిత బంగ్లా లేదా అపార్ట్‌మెంట్ కేటాయిస్తారు. అందులో ఫర్నిచర్‌కు ప్రత్యేక బడ్జెట్.
ప్రయాణ భత్యం
పార్లమెంటు సమావేశాలకు సొంత వాహనంలో వస్తే కిలోమీటరుకు రూ.16 చొప్పున ప్రయాణ భత్యం
విద్యుత్, నీరు
ఢిల్లీలోని అధికారిక నివాసానికి ఏడాదికి 50 వేల యూనిట్ల ఉచిత విద్యుత్. 4 వేల కిలోలీటర్ల ఉచిత నీరు
ఫోన్, ఇంటర్నెట్
ఢిల్లీ నివాసం, కార్యాలయం, నియోజకవర్గం.. మూడు చోట్లా కలిపి మూడు ల్యాండ్‌లైన్ ఫోన్లు, హైస్పీడ్ ఇంటర్నెట్
వైద్యం
సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ కింద ఎంపీ, వారి కుటుంబసభ్యులకు ప్రభుత్వ, గుర్తింపు పొందిన ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స
రూ.95 లక్షలు
ఎంపీ అభ్యర్థుల ఎన్నికల ఖర్చుపై గరిష్ఠ పరిమితి. కొన్ని చిన్న రాష్ట్రాల్లో ఈ పరిమితి రూ. 75 లక్షలు ఉంది.
ఎంపీ లాడ్స్
ప్రతి ఎంపీ తన నియోజకవర్గంలో రోడ్లు, తాగునీరు, పాఠశాల భవనాల వంటి అభివృద్ధి పనుల కోసం ఏడాదికి రూ.5 కోట్లు (ఐదేళ్లకు రూ.25 కోట్లు) జిల్లా కలెక్టర్ ద్వారా మంజూరు చేయొచ్చు.
పెన్షన్
ఒక్కసారి ఎంపీ అయి, పదవీకాలం పూర్తిచేసుకున్నవారికి (ఒక్కరోజు ఎంపీగా ఉన్నా సరే) జీవితాంతం నెలకు రూ.31 వేల పెన్షన్. ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం ఎంపీగా ఉంటే ప్రతి అదనపు ఏడాదికీ నెలకు 2500 చొప్పున పెన్షన్ పెంచి ఇస్తారు.
2011 జనాభా లెక్కల ప్రకారమైతేతెలంగాణకు 15 ఆంధ్రప్రదేశ్‌కి 21
న్యూఢిల్లీ, నవంబరు 29: దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో 50శాతం చొప్పున లోక్‌సభ స్థానాలను పెంచుతూ తీసుకున్న నిర్ణయం వల్ల దాదాపు అన్ని పెద్ద రాష్ట్రాల్లోనూ సీట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అలా కాకుండా.. 2011 జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన చేపడితే తెలుగు రాష్ట్రాలు సహా పలు పెద్ద రాష్ట్రాలు ఇప్పటికే తమకున్న సీట్లను కోల్పోయేవి. ఉత్తరప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాలకు మాత్రం ఏ లెక్కలో అయినా సీట్ల సంఖ్య పెరిగేది. కాకపోతే.. 2011తో పోలిస్తే ఆ రాష్ట్రాలకు.. ఈ 50ు పెంపు ప్రతిపాదనతో భారీగా సీట్లు పెరుగుతాయి.