ఎల్‌ఎన్‌జీ ట్యాంకర్ల ధరలకు రెక్కలు
ABN , Publish Date - Mar 04 , 2026 | 03:47 AM
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో ఖతార్‌లో ఎల్‌ఎన్‌జీ(లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్) ఉత్పత్తి నిలిపివేసిన నేపథ్యంలో ఎల్‌ఎన్‌జీ ట్యాంకర్ల ధరలను షిప్పింగ్ కంపెనీలు భారీగా పెంచేశాయి......
రోజుకు 2లక్షల డాలర్లు డిమాండ్ చేస్తున్న షిప్పింగ్ సంస్థలు
భారత్ వద్ద 40-45 రోజులకు సరిపడా చమురు నిల్వలు
న్యూఢిల్లీ, మార్చి 3: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో ఖతార్‌లో ఎల్‌ఎన్‌జీ(లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్) ఉత్పత్తి నిలిపివేసిన నేపథ్యంలో ఎల్‌ఎన్‌జీ ట్యాంకర్ల ధరలను షిప్పింగ్ కంపెనీలు భారీగా పెంచేశాయి. షిప్పింగ్ కంపెనీల యజమానులు, బ్రోకర్లు అట్లాంటిక్ బేసిన్‌లో ఒక్కో ఎల్‌ఎన్‌జీ ట్యాంకర్ కోసం రోజుకు 2లక్షల డాలర్లకు పైగా అద్దె డిమాండ్ చేస్తున్నారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. సోమవారం 61,500 డాలర్లుగా ఉన్న ఈ ధర ఒక్క రోజు వ్యవధిలో భారీగా పెరగడం గమనార్హం. ట్యాంకర్ల ధరలు ఆకాశాన్ని తాకడంతో ఎల్‌ఎన్‌జీ రవాణాకు సంబంధించి కొత్త బుకింగ్‌లు జరగడం లేదని షిప్పింగ్ కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. ఖతార్, అబుధాబీలో ఉత్పత్తి తిరిగి పూర్వస్థితికి వచ్చే వరకు ట్యాంకర్ల ధరలు ఇదే స్థాయిలో కొనసాగుతాయని అంటున్నారు. ఇరాన్ చేసిన డ్రోన్ దాడి నేపథ్యంలో తప్పనసరి పరిస్థితుల్లో భారత్‌కు సహజవాయువు దిగుమతులను 40 శాతం మేర తగ్గిస్తున్నామని ఖతార్ ప్రకటించనట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. భారత్ ఏడాదికి దిగుమతి చేసుకునే దాదాపు 27 లక్షల టన్నుల ఎల్‌ఎన్‌జీలో 40 శాతం ఖతార్ నుంచే వస్తుంది. మరోపక్క, పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ లిమిటెడ్, అబుధాబీ నేషనల్ ఆయిల్ కంపెనీలు ఎల్‌ఎన్‌జీ ఎగుమతులను 10 నుంచి 30 శాతం దాకా తగ్గిస్తున్నామని భారత్‌లోని తమ వినియోగదారులైన గెయిల్, ఐవోసీ తదితర సంస్థలకు ఇప్పటికే సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. ఎల్‌ఎన్‌జీ దిగుమతులు హఠాత్తుగా తగ్గిన నేపథ్యంలో భారతీయ సంస్థలు కూడా సహజవాయువు సరఫరాను మంగళవారం నుంచి తగ్గించాయి. ఐసీఐఎ్‌స డైరెక్టర్ అజయ్ పర్మార్ అంచనాల ప్రకారం.. ఇరాన్ సంక్షోభం నేపథ్యంలో పశ్చిమాసియా దేశాల్లో అనిశ్చితి మరికొంత కాలం కొనసాగినా చైనా వద్ద ఆరు నెలల అవసరాలకు సరిపడా చమురు నిల్వలు ఉన్నాయి.
కానీ, భారత్ వద్ద ఆ స్థాయి నిల్వలు లేవు. భారత్ వద్ద 74 రోజుల అవసరాలకు సరిపడా చమురు, ఇంధన నిల్వలు ఉన్నాయని చమురు శాఖ మంత్రి హర్‌దీ్‌పసింగ్ పురి గత నెలలో ప్రకటించారు. అయితే, భారత్ వద్ద మరో 20 నుంచి 25 రోజుల అవసరాలకు సరిపోయే చమరు నిల్వలు మాత్రమే ఉన్నాయని చమురు శుద్ధి పరిశ్రమల వర్గాలు రాయిటర్స్‌కు వెల్లడించాయి. కానీ, కెప్లర్ సంస్థ అంచనాల ప్రకారం.. భారతదేశానికి బయలుదేరి హోర్ముజ్ జలసంధిలో ఇరుక్కుపోయిన నౌకలు గమ్యస్థానాలను చేరుకుంటే.. ఇప్పటికే ఉన్న నిల్వలతో కలిపి భారత్ వద్ద 40 నుంచి 45 రోజుల అవసరాలకు సరిపడే చమురు నిల్వలు ఉంటాయి. కాగా, పశ్చిమాసియా దేశాల నుంచి ముడిచమురు దిగుమతులు ఆగిపోతే ఆ లోటును భర్తీ చేసుకునేందుకు వెస్ట్ ఆఫ్రికా, లాటిన్ అమెరికా, అమెరికాలోని చమురు సంస్థలపై భారత్ ఆధారపడాలి. అలాగే, అమెరికాతో వాణిజ్య ఒప్పందం కోసం రష్యా చమురు దిగుమతులను తగ్గించుకున్న భారత్ తిరిగి రష్యా చమురు కొనుగోళ్లపైనా దృష్టి సారించాలి. లేదంటే చమురు కొరత ఏర్పడి ధరలు పెంచాల్సిన పరిస్థితి తప్పనిసరి అవుతుంది.