ఆడ్వాణీకి అస్వస్థత
ABN , Publish Date - Oct 17 , 2026 | 03:50 AM
బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్కే ఆడ్వాణీ శుక్రవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ఛాతీలో ఇన్ఫెక్షన్తో ఢిల్లీలోని అపోలోలో చేరిక
ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు
న్యూఢిల్లీ, అక్టోబరు 16: బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్కే ఆడ్వాణీ శుక్రవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో ఇన్ఫెక్షన్తో ఇబ్బందిపడుతున్న ఆయనను ఢిల్లీలోని అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. 98 ఏళ్ల ఆడ్వాణీ కొన్నేళ్లుగా వయో సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ ఏడాది మేలో అపోలో ఆస్పత్రిలో చేరి, కొన్ని రోజుల చికిత్స అనంతరం డిశ్చార్జి అయ్యారు. ప్రభుత్వాధినేతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని మోదీ ఇటీవలే ఆడ్వాణీ నివాసానికి వెళ్లి ఆశీర్వాదం తీసుకోవడం గమనార్హం. అప్పుడు ఆడ్వాణీ కాస్త చురుకుగానే కనిపించారు. అవిభక్త భారత్లో భాగమైన, ప్రస్తుతం పాక్లో ఉన్న కరాచీలో 1927లో ఆడ్వాణీ జన్మించారు. స్వాతంత్య్ర సమయంలో భారత్, పాక్గా విడిపోవడంతో ఇక్కిడికి వచ్చారు. బీజేపీ ప్రస్థానంలో కీలక నేతగా వ్యవహరించారు. ఆ పార్టీకి మూడు సార్లు అధ్యక్షుడిగా పనిచేశారు. 2002-2004 మధ్య ఉప ప్రధానిగా పనిచేశారు.