Share News

దివికేగిన దర్శక దిగ్గజం

ABN , Publish Date - Jun 11 , 2026 | 04:29 AM

గ్రామీణ జీవనాన్ని సెల్యులాయిడ్‌పై అద్భుతంగా ఆవిష్కరించిన కోలీవుడ్‌ దిగ్దర్శకుడు.. పదినారు వయదినిలే, ముదల్‌ మరియాదై, వేదం పుదిదు వంటి ఆణిముత్యాల్లాంటి చిత్రాలతో ...

దివికేగిన దర్శక దిగ్గజం

  • అనారోగ్యంతో భారతీరాజా కన్నుమూత

  • గ్రామీణ జీవనాన్ని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించిన డైరెక్టర్‌

  • పదినారు వయదినిలే, ముదల్‌ మరియాదై వంటి ఎన్నో క్లాసిక్‌ చిత్రాలతో ప్రేక్షక హృదయాల్లో స్థానం

  • సినీ, రాజకీయ ప్రముఖుల ఘన నివాళి

  • తమిళ సర్కార్‌ లాంఛనాలతో ఆయన స్వగ్రామంలో నేడు అంత్యక్రియలు

(చెన్నై, ఆంధ్రజ్యోతి)

గ్రామీణ జీవనాన్ని సెల్యులాయిడ్‌పై అద్భుతంగా ఆవిష్కరించిన కోలీవుడ్‌ దిగ్దర్శకుడు.. పదినారు వయదినిలే, ముదల్‌ మరియాదై, వేదం పుదిదు వంటి ఆణిముత్యాల్లాంటి చిత్రాలతో ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న లెజెండరీ డైరెక్టర్‌.. భారతీరాజా (84) ఇక లేరు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం కన్నుమూశారు. గత ఏడాది తన కుమారుడు, సినీ హీరో, దర్శకుడు మనోజ్‌ భారతీరాజా (48) గుండెపోటుతో మరణించినప్పటి నుంచి భారతీరాజా మానసికంగా కుంగిపోయారు. ఈ మధ్యకాలంలో పలుమార్లు ఆస్పత్రిపాలైన ఆయన.. గత కొన్ని రోజులుగా ఇంటిపట్టునే ఉండి వైద్యం చేయించుకుంటున్నారు. ఈ క్రమంలోనే బుధవారం వేకువజామున ఆయన తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. 1941 జూలై 17న తమిళనాడులోని తేని జిల్లా అల్లినగరంలో జన్మించిన భారతీరాజా 1997లో పదినారు వయదినిలే చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. సిగప్పు రోజాక్కళ్‌ (తెలుగులో ఎర్రగులాబీలు), అలైగల్‌ ఓవయదిల్లై (తెలుగులో సీతాకోకచిలుక), పుదియ వార్పుగళ్‌ (తెలుగులో కొత్తజీవితాలు).. ఇలా ఆయన దర్శకత్వంలో వచ్చిన మెజారిటీ చిత్రాలు క్లాసిక్స్‌గా నిలిచిపోయాయి. భారతీరాజా మృతిపట్ల తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌, మాజీ ముఖ్యమంత్రులు ఎంకే స్టాలిన్‌, ఎడప్పాడి కె.పళనిస్వామి, సంగీత దర్శకుడు ఇళయరాజా, కోలీవుడ్‌ అగ్ర నటులు రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. కాగా.. తమిళనాడు దిండుగల్‌ జిల్లా కొడైకెనాల్‌ సమీపాన వత్తలగుండు ఘాట్‌రోడ్డులోని ఆయన సొంత ఎస్టేట్‌లో భారతీ రాజా అంత్యక్రియలు గురువారం జరపనున్నట్టు ఆయన కుమార్తె జనని తెలిపారు. తండ్రి మరణవార్త తెలియగానే మలేసియా నుంచి చెన్నైకు చేరుకున్న ఆమె.. భారతీరాజా కోరిక మేరకే ఆయన అంత్యక్రియలను ఆయన స్వగ్రామంలో నిర్వహించనున్నట్టు తెలిపారు.


తమిళ చిత్రపరిశ్రమపై తనదైన ముద్ర..

భారతీరాజా మరణం పట్ల సీఎం విజయ్‌ సంతాపం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘దిగ్గజ దర్శకుడు భారతీరాజా భౌతికంగా ఇక లేరన్న వార్త తెలుసుకుని దుఃఖానికి లోనయ్యా. గ్రామీణ నేపథ్యంలో ఎన్నో చైతన్యవంతమైన చిత్రాలను రూపొందించిన ఆయన తమిళ చిత్రపరిశ్రమపై తనదైన ముద్ర వేశారు. ‘పద్మశ్రీ’ సహా పలు జాతీయ, రాష్ట్ర పురస్కారాలను అందుకున్నారు. భారతీరాజా మృతి తమిళ చిత్రపరిశ్రమకు పూడ్చలేని నష్టం’’ అని అందులో ఆవేదన వెలిబుచ్చారు. చిత్రపరిశ్రమకు భారతీరాజా చేసిన సేవలకు గుర్తింపుగా.. ఆయన పార్థివదేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలిపారు.

2.jpg

నేనంటే ఇష్టం.. నా నటన ఇష్టంలేదనేవారు

భారతీరాజా ప్రతిభ, విజయాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఒక చిన్నపిల్లాడివంటివారు. తన మనసులో ఉన్న విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తారు. చిత్రపరిశ్రమలో ఏ సమస్య వచ్చినా దానిపై గళం విప్పి పోరాడిన మొదటి వ్యక్తి ఆయనే. ఆయన చేసిన పనులు చరిత్రలో శాశ్వతం. ఆయనకు ఏదైనా నచ్చితే నచ్చిందని చెబుతారు. నచ్చకపోతే నచ్చలేదని చెబుతారు. ఆయన నన్ను ఎంతగానో విమర్శించారు. ‘నువ్వు నాకు నచ్చావు.. నీ నటన నాకు నచ్చలేదు’ అని చెప్పేవారు. ఆయలా నిర్మొహమాటంగా మాట్లాడేవారు మరొకరు లేరు. ఆయన జీవించి ఉండగా చూడాలని భావించాను. కానీ, అది సాధ్యంకాలేదు. ఆయన నా జ్ఞాపకాలలో నిలిచిపోతారు.

-రజనీకాంత్‌

Updated Date - Jun 11 , 2026 | 05:58 AM