ఎల్డీఎఫ్ ఓటమికి ఎన్నో కారణాలు
ABN , Publish Date - May 05 , 2026 | 05:20 AM
కర్ణుడి చావుకి కారణాలెన్నో అన్న సామెత చందంగా.. కేరళంలో ఎల్డీఎఫ్ కూటమి ఓటమికి కూడా చాలా కారణాలున్నాయి. అందులో ముఖ్యమైనవి..
పినరాయి సర్కారు అవినీతిపై వ్యతిరేకత
కర్ణుడి చావుకి కారణాలెన్నో అన్న సామెత చందంగా.. కేరళంలో ఎల్డీఎఫ్ కూటమి ఓటమికి కూడా చాలా కారణాలున్నాయి. అందులో ముఖ్యమైనవి.. విజయన్ సర్కారుపై వచ్చిన అవినీతి ఆరోపణలు, బంగారం స్మగ్లింగ్ కుంభకోణం.. దానికి పాల్పడినవారికి ఏకంగా సీఎంవోతోనే సంబంధాలు ఉండడం, శబరిమల బంగారు తాపడం కుంభకోణం, అయ్యప్ప గుడిలోకి మహిళల ప్రవేశంపై సుప్రీం తీర్పును అమలు చేయడానికి సిద్ధపడి హిందువుల ఆగ్రహానికి గురికావడం. వీటన్నింటికీ మించి.. క్రైస్తవుల ఓట్ల కోసం ఆశపడి ముస్లింల ఆగ్రహానికి గురికావడం మరో ప్రధాన కారణం. తమకు బలమైన ఓటుబ్యాంకుగా ఉన్న ముస్లిం మైనారిటీ వర్గాలను కలుపుకొని పోయే సీపీఎం, గత లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత తన పంథా మార్చుకుంది. వారికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన నేతలను రాష్ట్ర మంత్రులే వెళ్లి కలవడం ముస్లింల్లో ఆగ్రహానికి కారణమైంది. ఉదాహరణకు.. కేరళలో యువతను నిర్వీర్యం చేయడానికి లవ్ జిహాద్‌ను, నార్కోటిక్ జిహాద్‌ను వాడుతున్నారంటూ పాలాయా బిషప్ మార్ జోసెఫ్ కల్లరంగట్ ఒక ప్రసంగంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సమయంలోనే.. రాష్ట్ర మంత్రి వి.ఎన్.వాసవన్ స్వయంగా వెళ్లి కలవడంతో ముస్లింల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక, కేరళలోని శక్తిమంతమైన ‘ఈళవ’ సామాజికవర్గానికి చెందిన నాయకుడు, ఎస్‌ఎన్‌డీపీయోగం (శ్రీనారాయణ ధర్మ పరిపాలన యోగం) నాయకుడు వెల్లాపల్లి నటేశన్‌ను.. మంత్రి వాసవన్ తన కారులో స్వయంగా అయ్యప్ప సంగమాలకు తీసుకెళ్లడంతో.. ఆ పార్టీపై ముస్లింల్లో ఆగ్రహం మరింత పెరిగింది. ఈ అయ్యప్ప సంగమాల కథేమిటంటే.. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినప్పుడు, పినరాయి సర్కారు దాని అమలుకు సిద్ధమైంది. దీనిపై హిందూ సంఘాలు, భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో రూటు మార్చి వారికి దగ్గరయ్యేందుకు వెల్లాపల్లి నటేశన్‌ను వాడుకుంది. ఈ వ్యవహారమంతా ఆ పార్టీ ప్రాథమిక సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉండడంతో.. ముస్లిం ఓటర్లంతా కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ కూటమివైపు మొగ్గు చూపారు. గంపగుత్తగా ఓట్లు వేశారు. ఫలితమే ఈ ఘోర ఓటమి.