Land Records Digitisation: 19 రాష్ట్రాల్లో భూరికార్డుల డిజిలైజేషన్ పూర్తి
ABN , Publish Date - Jan 03 , 2026 | 02:39 AM
దేశవ్యాప్తంగా భూ రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. భూ రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియలో కీలక అంశాలను భూవనరుల శాఖ దాదాపుగా పూర్తి చేసింది..
న్యూఢిల్లీ, జనవరి 2: దేశవ్యాప్తంగా భూ రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. భూ రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియలో కీలక అంశాలను భూవనరుల శాఖ దాదాపుగా పూర్తి చేసింది. 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు... అండమాన్-నికోబార్, బిహార్, చండీగఢ్, గోవా, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పుదుచ్చేరి, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర, ఉత్తరపద్రేశ్‌లలో ఈ ఆన్‌లైన్ ప్రక్రియ ముగిసింది. ఈ రాష్ట్రాల్లోని ప్రజలు తమ భూమి రికార్డులను తమ ఇంటి నుంచే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 406 జిల్లాల్లో భూ రికార్డులను నేరుగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తనిఖీ చేసి తనఖాలో ఉందో లేదో నిర్ధారించుకోవచ్చు. జాతీయ స్థాయిలో ఆర్‌ఓఆర్ డిజిటలైజేషన్ సుమారుగా 97.27ు గ్రామాల్లో పూర్తి అయింది. మరోవైపు పట్టణ భూ ఆస్తుల డిజిటలైజేషన్ పైలెట్ ప్రాజెక్టు ‘నక్ష’ 157 పట్టణ స్థానిక సంస్థల్లో చురుకుగా సాగుతోంది. ఇప్పటివరకు 29 రాష్ట్రాల్లోని 36 కోట్ల భూ కమతాలకు జియో కో ఆర్డినేట్స్ ఆధారంగా 14 అక్షర సంఖ్యలతో ఏర్పాటు చేసిన ‘యునిక్ ల్యాండ్ పార్శిల్ ఐడెంటిఫికేషన్ నంబర్(యూఎల్‌పీఐన్)’... ‘భూ ఆధార్’ కేటాయించారు.